ఇంద్రకీలాద్రిపై భక్తులకు మరో మహా వరం..

శ్రావణంలో నూతన ప్రసాదం పోటు, అన్నప్రసాద భవనాల ప్రారంభం
ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఈవో వి.కె. శీనా నాయక్ ప్రత్యేక సమీక్ష
వేద పండితులు నిర్ణయించే ముహూర్తానికే ప్రారంభోత్సవం
ఇంజినీరింగ్, ప్రసాదం, అన్నప్రసాద విభాగాల సమన్వయంతో శరవేగంగా ఏర్పాట్లు
భక్తులకు మరింత నాణ్యమైన, వేగవంతమైన సేవలే దేవస్థానం లక్ష్యం


(ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన ప్రసాదం పోటు (ప్రసాద తయారీ కేంద్రం), నూతన అన్నప్రసాద భవనాల ప్రారంభోత్సవానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రావణ మాసం తొలి లేదా రెండో వారంలో ఈ భవనాలను భక్తులకు అంకితం చేసే దిశగా దేవస్థానం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం ఈవో ఛాంబర్‌లో జరిగిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించి వివిధ విభాగాల అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఈవో శీనా నాయక్ మాట్లాడుతూ, దేవాదాయ శాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు అందిన వెంటనే, ఆలయ వేద పండితులు నిర్ణయించే పవిత్ర ముహూర్తం ప్రకారం ప్రారంభోత్సవ తేదీని ఖరారు చేసి అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. శ్రావణ మాసంలోనే ఈ నూతన భవనాలను భక్తుల సేవకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

ప్రారంభోత్సవ సమయానికి ఎలాంటి లోపాలు లేకుండా ఉండేందుకు ఇంజినీరింగ్ విభాగం, లడ్డూ ప్రసాదం తయారీ విభాగం, అన్నప్రసాద విభాగం పరస్పర సమన్వయంతో సంయుక్త కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఈవో ఆదేశించారు. యంత్రాల పనితీరు, విద్యుదీకరణ, మౌలిక సదుపాయాలు, ప్రసాద తయారీ ప్రక్రియ, అన్నప్రసాద పంపిణీ వంటి అన్ని ఏర్పాట్లు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండేలా విభాగాల వారీగా బాధ్యతలు అప్పగించి నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు.

నూతన ప్రసాదం పోటు, అన్నప్రసాద భవనాలు అందుబాటులోకి రావడంతో ప్రసాదాల తయారీ సామర్థ్యం పెరగడంతో పాటు, భక్తులకు మరింత పరిశుభ్రమైన, నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు వీలుకానుందని అధికారులు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులు, ప్రసాదం పోటు, అన్నప్రసాద విభాగాల అధికారులు, ఆలయ సూపరింటెండెంట్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.