ఎల్‌నినో ప్రభావంపై ఆక్వా రైతులకు అవగాహన కార్యక్రమం..

నర్సాపురం, ఆంధ్ర ప్రభ : ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ విశ్వవిద్యాలయం, కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్, నరసాపురం ఆధ్వర్యంలో ఎల్‌నినో ప్రభావంపై ఆక్వా రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నర్సాపురం మండలం సారవ పరిసర ప్రాంతాల చేపలు, వనామి రొయ్యల రైతులకు శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు. ఎల్‌నినో (El Nino) ప్రభావం మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా బోధన సిబ్బంది మాట్లాడుతూ, ఎల్‌నినో అనేది ఒక సహజ వాతావరణ పరిస్థితని, దీని ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం, నీటి కొరత వంటి పరిస్థితులు ఏర్పడతాయని వివరించారు. ఈ పరిస్థితులు చేపలు, రొయ్యల సాగుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చెరువుల్లో కరిగిన ఆక్సిజన్ (DO) స్థాయిలు తగ్గిపోవడం, నీటి మట్టం తగ్గడం జరుగుతుందని పేర్కొన్నారు. ఉష్ణోగ్రత పెరగడం వల్ల రొయ్యల జీవక్రియ వేగవంతమై ఆహారపు అలవాట్లు మారుతాయని, అవసరానికి మించి మేత వేయడం వల్ల మిగిలిన మేత కుళ్లిపోయి అమోనియా వంటి హానికర పదార్థాల స్థాయిలు పెరిగి నీటి నాణ్యత దెబ్బతింటుందని వివరించారు.

రైతులు చెరువుల నీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ, ముఖ్యంగా DO, pH, అమోనియా వంటి నీటి నాణ్యత ప్రమాణాలను తరచుగా పరీక్షించుకోవాలని సూచించారు. అవసరమైన మేరకు గట్ ప్రొబయోటిక్స్ మరియు వాటర్ ప్రొబయోటిక్స్ వినియోగించాలని, తీవ్రమైన ఎండలు ఉన్న రోజుల్లో మధ్యాహ్న సమయంలో మేత వేయకుండా ఉండడం మంచిదని తెలిపారు.అలాగే, అధిక ఉష్ణోగ్రతల వల్ల చేపలు, రొయ్యల రోగనిరోధక శక్తి తగ్గి, పెరుగుదల మందగించడం, మరణాల శాతం పెరగడం, చివరికి దిగుబడి తగ్గి రైతులకు ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉందని వివరించారు.ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటించి, నీటి నాణ్యత నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని శాస్త్రవేత్తలు సూచించారు.

ఈ కార్యక్రమంలో అసోసియెట్ డీన్ డా. కె. మాధవి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డా. ఎన్. వి. రావు, డా. కె. శ్రావణి, రైతులు కడలి ముత్యాలు, మూసే రామాంజనేయులు, కానూరు శ్రీను, గన్నబత్తుల కృపా, మల్లుల రామకృష్ణ, కడలి పెద్దిరాజు, కానూరు వెంకటేశ్వరావు, కడలి సత్యనారాయణ, కవురు శివ, ఫిషరీస్ కళాశాల విద్యార్థులు, విద్యార్థినులు, రైతులు పాల్గొన్నారు.