Coastal Corridor Andhra Pradesh | కోస్తావాసుల చిరకాల కల

Coastal Corridor Andhra Pradesh | కోస్తావాసుల చిరకాల కల
Coastal Corridor Andhra Pradesh | బాపట్ల-మచిలీపట్నం రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం
రూ.2816 కోట్లతో డీపీఆర్ సిద్ధం
47 కి.మీ కొత్త లైన్‌తో కోస్టల్ కారిడార్
పోర్టులు, పర్యాటక రంగానికి భారీ ఊతం
Coastal Corridor Andhra Pradesh | బాపట్ల, ఆంధ్రప్రభ బ్యూరో : బాపట్ల జిల్లా వాసుల చిరకాల కోరిక అయిన కోస్తా రైల్వే లైన్ ప్రతిపాదనలకు రైల్వే బోర్డు ఆమోదం ముద్ర వేసింది. ఇటీవల పార్లమెంట్‌లో దీనిపై పూర్తిస్థాయి చర్చ జరిగింది. రైల్వే శాఖ మంత్రి Ashwini Vaishnaw సర్వే పనుల గురించి పార్లమెంట్‌లో వివరణ ఇచ్చారు. బాపట్ల, రేపల్లె, మచిలీపట్నం రైల్వే లైన్ పనుల డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని పార్లమెంట్‌లో ప్రకటించారు.
కాగా, రెండు సెక్షన్లుగా విభజిస్తూ నిధులు కూడా మంజూరు చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. బాపట్ల-నిజాంపట్నం-రేపల్లె వరకు ఒక సెక్షన్‌గా సర్వే పూర్తి చేసి డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు. రేపల్లె నుండి మచిలీపట్నం వరకు రూ.2816 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేసి మొదటి దశలో పనులు ప్రారంభించనున్నారు.
కోస్తా కారిడార్ ఏర్పాటుకు తీర ప్రాంతంలో సర్వే చేసినప్పుడే ఈ ప్రాంతానికి రైల్వే లైన్ అవసరాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారులు గుర్తించి రైల్వే ఉన్నతాధికారులకు తెలిపారు. ఎట్టకేలకు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్, వల్లభనేని బాలశౌరి అనేకసార్లు పరిస్థితిని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకువెళ్లి ఒప్పించగలిగారు.
కోనసీమ నుండి దివిసీమ మీదుగా భావపురి తీరప్రాంత వాసుల కల నెరవేరనుంది. 47 కిలోమీటర్ల కొత్త లైన్ ఏర్పాటు చేస్తే కోస్టల్ కారిడార్ కల సాకారం అవుతుంది. కాకినాడ నుండి కోటిపల్లి వరకు 30 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ ఇప్పటికే ప్రారంభించారు. కోటిపల్లి నుండి నరసాపూర్ లైన్ నిర్మాణంలో ఉంది. నరసాపురం నుంచి మచిలీపట్నం మీదుగా బాపట్ల వరకు కారిడార్ తీసుకురావడానికి మధ్యలో గేట్‌వే పోర్టు, కాకినాడ పోర్టుల మధ్య 30 కిలోమీటర్ల కొత్త లైన్ నిర్మిస్తే సరిపోతుందని కేంద్ర బృందం భావిస్తోంది.
కాగా, బాపట్ల-బందరు రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాపట్ల నుండి రేపల్లె సర్వే పూర్తి కాలేదు. రేపల్లె నుండి మచిలీపట్నం కొత్త రైల్వే లైన్‌కు కీలక అడుగు పడింది. 47.81 కిలోమీటర్ల పొడవైన ఈ నూతన లైన్‌కు సంబంధించిన ఫైనల్ డీపీఆర్‌కు రైల్వే బోర్డు ఆమోదముద్ర వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
మచిలీపట్నం నుండి రేపల్లె మధ్యలో పెనుమూడి, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, మాజేరు, రుద్రవరం ప్రాంతాల్లో ఆరు రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేస్తారని, నాలుగేళ్లలో పనులు పూర్తి చేస్తారని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
కీలక పోర్టులకు అనుసంధానం
బాపట్ల నుండి కర్లపాలెం, చెరుకుపల్లి, కనగాల, నిజాంపట్నం మీదుగా రేపల్లె రైల్వే లైన్ డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. ప్రధానంగా మచిలీపట్నం-నిజాంపట్నం ప్రాంతాలకు చెందిన పోర్టులకు సరుకు రవాణాలో ఇది కీలక మార్గంగా మారబోతోంది. హౌరా-చెన్నై ప్రధాన రైల్వే మార్గంతో నేరుగా అనుసంధానం కావడంతో విజయవాడ మీదుగా చుట్టూ తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. దీంతో 50 నుండి 100 కిలోమీటర్ల వరకు దూరం కూడా తగ్గనున్నది. దివిసీమ, లంక గ్రామాల ప్రాంతాల్లో లక్షలాది ప్రజలకు విజయవాడ వెళ్లాల్సిన అవసరం లేకుండా దగ్గరి మార్గం అందుబాటులోకి రానుంది.
ప్రధానంగా మచిలీపట్నం పోర్టు అభివృద్ధికి, నిజాంపట్నం హార్బర్ అభివృద్ధికి, ఈ ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుంది. ఒంగోలు నుండి దిగమర్రు వరకు జాతీయ రహదారి 216ఏకు అనుసంధానంగా ఈ రైల్వే లైన్ ఏర్పడే అవకాశం ఉంది. దీంతో బాపట్ల జిల్లా ప్రాంతంలోని అనేక రొయ్యలు, చేపల ఉత్పత్తిదారులకు తమ ఉత్పత్తులను తేలికగా రవాణా చేసుకునేందుకు ఇది అద్భుతంగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
