సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక పూజలు…
కృత్తిక పర్వదినాన “శరవణభవ” నామస్మరణతో మారుమోగిన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : ఆషాఢ మాసంలోని పవిత్ర ఆడి కృత్తిక పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని మేకవానిపాలెం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా, భక్తులు భక్తిశ్రద్ధలతో ఆడి కృత్తిక కావడి సేవా మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయ ప్రాంగణం అంతా భక్తులు “శరవణభవ” నామస్మరణతో మారుమోగింది. కుటుంబ సభ్యుల సంక్షేమం, ఆయురారోగ్యాలు, సంతాన సౌభాగ్యం, సర్వమంగళాలు కలగాలని భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఆషాఢ మాసంలో కృత్తిక నక్షత్రం వచ్చే రోజును ఆడి కృత్తికగా భావిస్తారు. ఈ రోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటాయి. ఈ సందర్భంగా భక్తులు ఉపవాస దీక్ష ఆచరించి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు, జన్మవృత్తాంతాన్ని పారాయణం చేసి, సాయంత్రం కృత్తిక నక్షత్ర దర్శనం చేసుకోవడం విశేషం. ఈ విధంగా భక్తిశ్రద్ధలతో ఆడి కృత్తిక వ్రతాన్ని ఆచరించి స్వామివారిని సేవిస్తే దోషాలు తొలగి, దైవానుగ్రహం లభించి, మనసులో కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
