స్వచ్ఛ శుక్రవారంతో పరిశుభ్రతపై చైతన్యం
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ‘స్వచ్ఛ శుక్రవారం’ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కాసులపల్లి గ్రామంలో సర్పంచ్ గద్దల రాజశేఖర్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రతి శుక్రవారం ‘డ్రై డే’ పాటించాలని, ఇంటి ఆవరణతో పాటు పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టి సీజనల్ వ్యాధులను నివారించవచ్చని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి హైమద్ పాషా, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
