TG | సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ ముఖ్య ధ్యేయం… శ్రీధ‌ర్ బాబు

మంథని : సంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య ధ్యేయమని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, చట్టానికి లోబడి అధికారులంతా జవాబుదారి తనంతో పనిచేయాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… ప్రజలకు ఉపయోగపడే కార్యాలయాల నిర్మాణ పనులను ప్రజా ప్రభుత్వం చేపడుతుందని మంత్రి తెలిపారు. మంథని డివిజన్ కేంద్రంలో సమీకృత అధికారుల సముదాయం, నూతన ఆర్డీఓ కార్యాలయ నిర్మాణం చేపట్టామన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలను నిర్మిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు ఉన్న సమస్యలను చట్ట ప్రకారం పరిష్కారానికి కృషి చేయాలని, అధికారులలో జవాబుదారీతనం తీసుకుని రావడానికి చర్యలు చేపట్టామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి వ్యవస్థ వల్ల జరిగిన నష్టాలను భూ భారతి చట్టంతో పూడ్చెందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామన్నారు. చట్టానికి లోబడే మాత్రమే అధికారులంతా పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు.

మండల కేంద్రాల్లో కూడా కార్యాలయాలు అంతా ఒకే ప్రాంగణంలో ఉండే విధంగా అనువైన స్థలాలను ఎంపిక చేయాలని మంత్రి కలెక్టర్ కు సూచించారు. ప్రభుత్వం కల్పించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ప్రతిరోజూ వేలాది మంది మహిళలు వినియోగించు కుంటున్నారన్నారు. మహిళలకు రూ.500లకు గ్యాస్ సిలిండర్, 200యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, రూ.500ల బోనస్ అందించామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ బాగు చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. ఉగాది నుండి రేషన్ కార్డు దారులకు ఉచితంగా సన్న బియ్యం సరఫరా చేయనున్నామన్నారు. రైతులకు ఒక గింజ కూడా తాళ్ళు కట్ చేయకుండా మద్దతు ధరపై ధాన్యం కొనుగోలు చేశామన్నారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ.. మంథనిలో డివిజన్ కు సంబంధించిన అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉండే విధంగా సమీకృత కార్యాలయాల సముదాయం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. మంథని రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం వద్ద 4.5 కోట్ల డి.ఎం.ఎఫ్.టి నిధులతో చేపట్టిన సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నిర్మాణ పనులకు, రూ.30లక్షలతో చేపట్టిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు రిన్నోవేషన్ పనులకు, అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈకార్యక్రమంలో మంథని ఆర్డీఓ సురేష్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, మంథని ఇంచార్జి త‌హ‌సీల్దార్ గిరి, తహసీల్దార్ లు ఎస్ఈపి ఆర్ కే చక్రవర్తి, ఈఈ పి పి ఆర్.గిరీష్ బాబు, డి ఈ.నవీన్ కుమార్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఆర్టిఏ మెంబర్ సురేష్, మంథని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పెండ్రు రమ సురేష్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ బానయ్య, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్, సీనియర్ నాయకులు శశభూషణ్ కాచే, ఎస్సీ సెల్ మంథని డివిజన్ అధ్యక్షుడు మంథని సత్యం, సీనియర్ నాయకులు కుడుదుల వెంకన్న, గోటికారి కిషన్ జి, ఒడ్నాల శ్రీనివాస్, యువజన మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు ఎరుకల ప్రవీణ్, ఆకుల కిరణ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆరెల్లి కిరణ్ గౌడ్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *