ఆగస్టు 15లోగా గ్యాస్ కేవైసీ పూర్తి చేయాలి
ములకలపల్లి, ఆంధ్రప్రభ: గ్యాస్ కనెక్షన్ కలిగిన వినియోగదారులందరూ ఈ నెల 15వ తేదీలోగా తప్పనిసరిగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని హెచ్‌పీ గ్యాస్ మేనేజర్ తానం శ్రీనివాసరావు సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గత రెండేళ్లుగా కేవైసీ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ఇంకా కొంతమంది వినియోగదారులు పూర్తి చేయలేదన్నారు. గడువులోగా కేవైసీ చేయని వారి గ్యాస్ సబ్సిడీ నిలిచిపోవడంతో పాటు సాధారణ గృహ వినియోగ సిలిండర్ల సరఫరా కూడా నిలిపివేయబడే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఆగస్టు 16 నుంచి కేవైసీ పూర్తి చేయని వినియోగదారులు కమర్షియల్ ధరలకే సిలిండర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా ఉజ్వల పథకం లబ్ధిదారులు కేవైసీ చేయకపోతే వారికి లభించే రూ.350 సబ్సిడీ కూడా నిలిచిపోతుందని స్పష్టం చేశారు. వినియోగదారులు తమ సమీపంలోని గ్యాస్ ఏజెన్సీ లేదా గ్యాస్ డెలివరీ సిబ్బంది ద్వారా వెంటనే కేవైసీ పూర్తి చేసుకోవాలని కోరారు.
