అటవీ సంరక్షణకు పోలీస్, అటవీశాఖలు సమన్వయంతో పనిచేయాలి
జిల్లా ఎస్పీ నరసింహ
అటవీ భూముల అక్రమ ఆక్రమణలను అడ్డుకోవాలి
సూర్యాపేట, ఆంధ్రప్రభ : అడవులను నాశనం చేయవద్దని, అడవులు పెరిగితేనే కరవు లాంటి తీవ్ర పరిస్థితులను సమర్థవంతంగా అధిగమించవచ్చని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు.
శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అటవీశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అటవీ భూముల అక్రమ ఆక్రమణలను గట్టిగా నిరోధించాలని ఆదేశించారు.
ఎక్కడైనా అటవీ భూములు ఆక్రమణకు గురవుతున్నా, లేదా పోడు భూములకు సంబంధించి ఎలాంటి ధర్నాలు, ఆందోళనలు జరిగే అవకాశం ఉన్నా అటవీశాఖ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పోలీసుల సహకారం తీసుకుంటూ ముందుకు సాగాలన్నారు.
అడవుల విషయంలో తరచూ సమస్యలు సృష్టించే వారిని ముందుగానే గుర్తించి, వారికి చట్టాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. ఉభయ శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేస్తూ జిల్లాలో అడవులను రక్షించాలని పిలుపునిచ్చారు.
అలాగే అటవీశాఖ, పోలీస్ పరిధిలో నమోదైన పాత కేసులన్నింటినీ త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి దామోదర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, ఇన్‌స్పెక్టర్లు లక్ష్మినారాయణ, ఫారెస్ట్ రేంజ్ అధికారులు ఆదిత్య, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
