KNL | పగతో స్నేహం హతం..!

35 ఏళ్ల ఇంతియాజ్‌ను రాళ్లతో మోది హత్య
వ్యక్తిగత విభేదాలే కారణమని అనుమానం.. వన్‌టౌన్ పోలీసుల దర్యాప్తు


KNL | కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 7 (ఆంధ్రప్రభ): కర్నూలు నగరంలోని మాసూం భాష దర్గా సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. 35 ఏళ్ల ఇంతియాజ్ అనే వ్యక్తిని ఆయనకు పాత స్నేహితుడైన వ్యక్తే వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది.

స్థానికుల సమాచారం మేరకు, ఇంతియాజ్‌పై పెద్ద రాళ్లతో దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో మృతుడు, నిందితుడు ఇద్దరూ చాలాకాలంగా స్నేహితులుగా ఉన్నట్లు తెలిసింది. అయితే ఇటీవల వ్యక్తిగత విభేదాలు తీవ్రరూపం దాల్చడంతో ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇటీవల ఓ రాజకీయ నాయకుడి జన్మదిన వేడుకల్లో ఇద్దరూ కలిసి పాల్గొన్నప్పటికీ, వారి మధ్య విభేదాలు కొనసాగినట్లు సమాచారం. మృతుడు ఇంతియాజ్ 2014 కర్నూలు అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అనంతరం ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నట్లు తెలిసింది.

హత్యకు పాల్పడినట్లు భావిస్తున్న వ్యక్తి గతంలో నమోదైన ఒక కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. ఈ కోణంతో పాటు వ్యక్తిగత విభేదాల అంశంపై కూడా వన్‌టౌన్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా, హత్యకు దారితీసిన పూర్తి కారణాలు దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.