ఫ్యూచర్ సిటీకి గోదావరి, కృష్ణా జలాలు..
- మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాల తరలింపు
- ఉద్దండపూర్ నుంచి ఫ్యూచర్ సిటీకి కృష్ణా నీరు
- 100 ఏళ్ల తాగునీటి అవసరాలకు పక్కా ప్రణాళిక
- ఘన్‌పూర్‌లో భారీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్
- హైదరాబాద్‌తో పాటు పారిశ్రామిక కారిడార్లకూ నీటి సరఫరా
హైదరాబాద్, ఆంధ్రప్రభ: హైదరాబాద్ మహానగరానికి అనుసంధానంగా అవతరించనున్న భారత్ ఫ్యూచర్ సిటీలో గోదావరి, కృష్ణా నదీ జలాలు పరవళ్లు తొక్కనున్నాయి.
అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకోనున్న ఫ్యూచర్ సిటీలో 100 ఏళ్లపాటు తాగునీటికి భద్రత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది.
మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలు, ఉద్దండపూర్ నుంచి కృష్ణా జలాల తరలింపునకు సుమారు రూ.10 వేల కోట్లతో డీపీఆర్ సిద్ధమైంది.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగమైన మల్లన్నసాగర్, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఉద్దండపూర్ నుంచి నీటి తరలింపునకు కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది.
ఉద్దండపూర్ రిజర్వాయర్ నుంచి ఫ్యూచర్ సిటీకి తాగునీరు అందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
రిజర్వాయర్ నుంచి ఫ్యూచర్ సిటీతో పాటు చందన్వెల్లి, సీతారాంపూర్ పారిశ్రామిక కారిడార్లకు నీటి సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఉద్దండపూర్ రిజర్వాయర్ నుంచి 3.89 టీఎంసీల నీటిని కొందుర్గు సమీపంలోని ట్రంక్ లైన్‌కు ఎత్తిపోసి, అక్కడి నుంచి రాఘవాపూర్–అంతర్వేది–కమ్మదనం మీదుగా కొడంగల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వరకు తరలించేందుకు ప్రణాళిక రూపొందించింది.
అనంతరం కొడంగల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి శుద్ధి చేసిన నీటిని భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు సంబంధిత ప్రాంతాలకు సరఫరా చేసేందుకు త్వరలో పనులు ప్రారంభించాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది.
మొదట కేశవపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించాలని ప్రతిపాదించినప్పటికీ, దూరం, ఖర్చు ఎక్కువవుతుండటంతో తాత్కాలికంగా ఆ ప్రతిపాదనను పక్కకు పెట్టి మల్లన్నసాగర్, ఉద్దండపూర్ ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుకు తెచ్చింది.
మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్నసాగర్ నుంచి నీటిని తరలించే ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది.
మల్లన్నసాగర్ నుంచి 15 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు డీపీఆర్ సిద్ధం చేసింది.
ఈ నీటిలో 10 టీఎంసీలు హైదరాబాద్‌కు, 5 టీఎంసీలు ఫ్యూచర్ సిటీతో పాటు విస్తరిస్తున్న హైదరాబాద్ అవసరాలకు వినియోగించేందుకు ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి.
మల్లన్నసాగర్ నుంచి పైప్‌లైన్ ద్వారా నీటిని ఘన్పూర్ పంప్‌హౌస్‌కు తీసుకొస్తారు. అక్కడి నుంచి అవసరమైన రిజర్వాయర్లు, బ్యాలెన్సింగ్ ట్యాంకులు, శుద్ధి కేంద్రాలకు పంపించి, ఫ్యూచర్ సిటీతో పాటు హైదరాబాద్‌కు గోదావరి జలాలు సరఫరా చేస్తారు.
కేశవపూర్ ప్రణాళికలో ఐదు దశల ఎత్తిపోతలు ఉండగా, కొత్త ప్రణాళికలో కేవలం రెండు దశల పంపింగ్ సరిపోతుంది.
మిగిలిన మార్గంలో నీరు గురుత్వాకర్షణతో ప్రవహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో విద్యుత్, నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
మల్లన్నసాగర్ నుంచి 3,000 నుంచి 3,600 మి.మీ. వ్యాసం కలిగిన పైప్‌లైన్ ద్వారా ఘన్పూర్ వరకు నీటిని సరఫరా చేస్తారు.
ఆ తర్వాత ఘన్‌పూర్‌లో 1,170 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, 80 మిలియన్ లీటర్ల మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించనున్నారు.
మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్‌సాగర్ వరకు సుమారు 162 మీటర్ల ఎత్తు వ్యత్యాసం ఉండటంతో, దారిపొడవునా ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
