హైదరాబాద్ రోడ్లకు కొత్త ప్రణాళిక..

  • రోడ్ నెట్‌వర్క్ విస్తరణకు వేగం..
  • సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో రోడ్ నెట్‌వర్క్‌కు సంబంధించిన అన్ని పనులను ఒకే వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌, హెచ్‌ఎండీఏ పరిధిలో చేపడుతున్న రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులపై ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు.

రోడ్ల నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ, నిధుల సమీకరణ, నిర్వహణతో పాటు ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్), రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్‌ఆర్), ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఇతర ప్రధాన రహదారులన్నింటినీ ఒకే సంస్థ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు.

ఓఆర్ఆర్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి

ఔటర్ రింగ్ రోడ్డుపై సరైన నిర్వహణ లేకపోవడం, రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఓఆర్ఆర్ నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి ప్రమాదాలను తగ్గించే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రేడియల్ రోడ్ల పనులు వేగవంతం చేయాలి

కొంగరకలాన్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు నిర్మిస్తున్న తొలి రేడియల్ రోడ్డు (రేడియల్ రోడ్-1) పనులను ఈ ఏడాది డిసెంబర్ 9 నాటికి పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. నిర్మాణంలో ఎదురయ్యే అడ్డంకులను వెంటనే తొలగించాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని సూచించారు.

పచ్చదనం, ఎలివేటెడ్ కారిడార్లపై ఆదేశాలు

రోడ్లకు ఇరువైపులా పచ్చదనం పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. బుద్వేల్ ట్రంపెట్ ఇంటర్‌చేంజ్ నిర్మాణం, బంజారాహిల్స్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ పనులను త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు.

భూసేకరణలో జాప్యం వద్దు

హైదరాబాద్ భవిష్యత్ అభివృద్ధి రోడ్ల విస్తరణపైనే ఆధారపడి ఉందని పేర్కొన్న సీఎం, భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో మధ్యవర్తుల జోక్యానికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని, టీడీఆర్‌ల జారీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.