TG | పదోన్నతులు ఇచ్చారు… పోస్టింగ్ లు మరిచారు..

TG | పదోన్నతులు ఇచ్చారు… పోస్టింగ్ లు మరిచారు..

  • ఉత్తర్వుల కోసం ఎదురుచూపులు
  • జీతం కూడా రావడం లేదంటున్న అధికారులు

హైదరాబాద్ ఆంధ్రప్రభ : ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పదోన్నతులు వచ్చాయన్న సంతోషం పోలీస్ అధికారుల్లో కొన్ని రోజులు కూడా నిలవలేదు.. పదోన్నతులు ఇచ్చిన ఉన్నతాధికారులు పోస్టింగ్లు ఇవ్వడం మర్చిపోవడంతో లబోదిబోమంటున్నారు. 42 రోజుల క్రితం ఏప్రిల్ 30వ తేదీన1996, 1998, 2002 బ్యాచ్ లకు చెందిన 35 మంది. ఇన్స్పెక్టర్లకు డిఎస్పీలుగా అధికారులకు పదోన్నతులు కల్పించారు. పోస్టింగులు మాత్రం ఇవ్వలేదు. పదోన్నతులు పొంది డీజీపి కార్యాలయంలో రిపోర్టు చేసిన సదరు పోలీస్ అధికారులు పోస్టింగ్ ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నారు.

పోస్టింగులు లేవు.. జీతాలు లేవు…

పదోన్నతి పొందిన అధికారులు డిజిపి కార్యాలయంలో రిపోర్టు చేశారు. అయితే 42 రోజులైనా వారికి పోస్టింగులు కేటాయించలేదు. పోస్టింగ్లు లేకపోవడం వల్ల జీతాలు కూడా రావడం లేదని లబోదిబోమంటున్నారు. ఎక్కడ పోస్టింగులు లభించని అధికారులను కేవలం బందోబస్తుకు మాత్రమే ఉపయోగిస్తున్నారు.

డీఎస్పీల బదిలీల కోసం ఎదురుచూపులు..

రాష్ట్ర పోలీస్ బాస్ గా సివి ఆనంద్ మే 1వ తేదీన బాధ్యతలు చేపట్టిన నాటినుండి డీఎస్పీలు బదిలీల ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో చాలామంది డిఎస్పీలు రెండేళ్ల నుండి ఓకే చోట పనిచేస్తుండడంతో పెద్ద ఎత్తున డీఎస్పీల బదిలీలు ఉంటాయని భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి లా అండ్ ఆర్డర్ లో పనిచేయని డీఎస్పీ స్థాయి అధికారులు సైతం కొత్త పోలీస్ బాస్ హయాం లో బదిలీలు జరిగి లా అండ్ ఆర్డర్ పోస్టింగ్లు దక్కుతాయని ఆశాభావంతో ఉన్నారు.

Leave a Reply