Telangana Rythu Discom | తెలంగాణలో కొత్త విద్యుత్ అధ్యాయం!

Telangana Rythu Discom | తెలంగాణలో కొత్త విద్యుత్ అధ్యాయం!

Telangana Rythu Discom | వేగంగా పూర్తవుతున్న రైతు డిస్కం ఏర్పాట్లు
ఉద్యోగుల ఆప్షన్లకు విశేష స్పందన
ఈఆర్సీ లైసెన్స్‌కు దాదాపు గ్రీన్ సిగ్నల్
వ్యతిరేకించిన వారే ఇప్పుడు దరఖాస్తులు
రైతు విద్యుత్ పంపిణీలో కొత్త మార్పులు

Telangana Rythu Discom | హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీ ఆర్పీడీసీఎల్) పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల కేటాయింపు, రైతు డిస్కం కంపెనీకి అవసరమైన లైసెన్స్‌లు, ఇతరత్రా పనులను అధికారులు చకాచకా పూర్తి చేస్తున్నారు. దీనికి అవసరమైన 2 వేల మంది ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ ఈ నెలాఖరుకు పూర్తి కానుంది. రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ సంస్థల నుంచి ఆసక్తి కలిగిన ఉద్యోగుల ఆప్షన్ల నమోదుకు విశేష స్పందన లభించింది.

దాదాపుగా పనులన్నీ పూర్తి

రైతు డిస్కం ఏర్పాటుకు కావాల్సిన అన్ని రకాల అనుమతులను పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కంపెనీ రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి అనుమతులు పొందడమే గాకుండా, జీఎస్టీ, ట్యాన్, కరెంట్ అకౌంట్ తదితర పనులన్నీ పూర్తయ్యాయి.

రైతు డిస్కం తన లావాదేవీలు జరిపేందుకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ (ఈఆర్సీ) లైసెన్స్ జారీకి దరఖాస్తు చేసుకుంది. రైతు డిస్కం ఏర్పాటుపై అభ్యంతరాలు, సూచనలు, సలహాల నిమిత్తం ఈ నెల 18 వరకు ఈఆర్సీ దరఖాస్తులను స్వీకరించగా, మొత్తం 30 మాత్రమే అభ్యంతరాలు వచ్చినట్టు తెలుస్తోంది.

గతంలో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ వార్షిక నివేదిక తదితర అంశాలపై ప్రతి ఏడాది ఈఆర్సీ నిర్వహించే బహిరంగ విచారణకు దాదాపు 250 నుంచి 300 మంది వరకూ దరఖాస్తు చేసేవారు. వీరంతా ఈఆర్సీ చేపట్టే విచారణలో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తపరిచేవారు. కానీ, రైతు డిస్కంపై అభ్యంతరాలు కేవలం 30 మాత్రమే రావడంతో ఈఆర్సీ లైసెన్స్ దాదాపుగా లభించినట్టేనని భావిస్తున్నారు.

వచ్చే నెల 2 నుంచి ప్రారంభం

ఈ నెల 28న అభ్యంతరాలు, సూచనలపై ఈఆర్సీలో బహిరంగ విచారణ జరగనుంది. నెలాఖరుకు ఉద్యోగుల కేటాయింపు పూర్తి కానుంది. రైతు డిస్కం ఆప్షన్లకు ఉద్యోగుల నుంచి విశేష స్పందన లభించింది.

వద్దన్న వారే.. ముద్దంటున్నారు…

రాష్ట్రంలో రైతు డిస్కం ఆచరణ సాధ్యం కాదనే వాదన మొదట్లో వినిపించింది. ముఖ్యంగా విద్యుత్ సంస్థల్లో 40 ఉద్యోగ సంఘాలన్నీ జేఏసీగా ఆవిర్భవించి రైతు డిస్కం ఏర్పాటును వెనక్కి తీసుకోవాలని, ఉద్యోగుల సర్వీస్ రూల్స్‌కు సంబంధించిన పలు అంశాలను లేవనెత్తాయి.

ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, జెన్కో, ట్రాన్స్‌కోలోని విద్యుత్ ఇంజనీర్లు, ఉద్యోగులు, సిబ్బంది రైతు డిస్కంపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. వాస్తవానికి రైతు డిస్కంకు అన్ని కేడర్లకు సంబంధించిన 2 వేల మంది సిబ్బంది అవసరం ఉండగా, ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగిన ఉద్యోగుల ఆప్షన్ల నమోదుకు 2,576 మంది ఆసక్తి చూపారు.

ఇంజనీరింగ్ కేడర్‌లో 511 మందికి 1254 మంది, నాన్ ఇంజనీరింగ్ కేడర్‌లో 1115 మందికి 1087 మంది, ఆర్టిజన్ల విభాగంలో 374 మందికి 235 మంది దరఖాస్తు చేసుకున్నారు. రైతు డిస్కంకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఒకప్పుడు రైతు డిస్కంను వ్యతిరేకించిన పలు ఉద్యోగ సంఘాల ముఖ్య నాయకులు ఉన్నట్టుగా తెలుస్తోంది. రైతు డిస్కం ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని చెప్పిన నాయకులే తిరిగి రైతు డిస్కంకు దరఖాస్తు చేయడంతో తమను ఇన్నాళ్లూ తప్పుదారి పట్టించారంటూ కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది, ఆర్టిజన్లు వాపోతున్నారు.

Leave a Reply