Luxury Resort | లగ్జరీ రిసార్ట్‌లో సెక్స్ రాకెట్
గుట్టు రట్టు చేసిన పోలీసులు
జిమ్ కార్బెట్ సమీపంలోని లగ్జరీ రిసార్ట్‌పై పోలీసుల దాడి.. 52 మంది అరెస్ట్
మైనర్ బాలికతో సహా 10 మంది మహిళలకు విముక్తి..
రిసార్ట్ సీజ్ చేసి యజమాన్యంపై కేసులు నమోదు
Luxury Resort | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యభిచార ముఠా గుట్టును ఉత్తరాఖండ్ పోలీసులు రట్టు చేశారు. జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం ప్రవేశ ద్వారం సమీపంలోని రామ్‌నగర్‌లో ఉన్న ఓ విలాసవంతమైన రిసార్ట్‌పై పోలీసులు నిర్వహించిన దాడిలో భారీ సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. వ్యభిచార కార్యకలాపాలతో పాటు రేవ్ పార్టీ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు దాడి చేసి 52 మందిని అదుపులోకి తీసుకున్నారు.
దాడిలో ఒక మైనర్ తో పాటు మొత్తం 10 మంది మహిళలను పోలీసులు రక్షించారు. విచారణలో ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా మహిళలను తీసుకొచ్చి, మద్యం పార్టీలతో పాటు అసభ్య నృత్యాలు నిర్వహిస్తూ వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ప్రతి మహిళకు రూ.10 వేల చొప్పున రేటు నిర్ణయించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కార్యక్రమం కోసం రిసార్ట్‌ను సుమారు రూ.2.20 లక్షలకు బుక్ చేసినట్లు గుర్తించారు. ఘటనాస్థలం నుంచి భారీ మొత్తంలో మద్యం, అభ్యంతరకర వస్తువులు మరియు ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ వ్యవహారంలో రిసార్ట్ యజమాన్యంపైనా కేసులు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS), వ్యభిచార నిరోధక చట్టం, పోక్సో చట్టం, ఎక్సైజ్ చట్టం తదితర నిబంధనల కింద కేసులు నమోదు చేసి రిసార్ట్‌ను పూర్తిగా సీజ్ చేశారు.
టూరిజం పేరుతో చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ ముఠాను పోలీసులు భగ్నం చేయడం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించి మరికొందరి ప్రమేయంపై కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
