కేజీబీవీ హాస్టల్‌లోకి అర్ధరాత్రి యువకుడు..

  • ప్రహరి గోడ దూకి లోపలికి వచ్చిన యువకుడు.. పోలీసులకు ఫిర్యాదు

మోతె, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ) హాస్టల్‌లోకి ఓ యువకుడు అర్ధరాత్రి చొరబడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పాఠశాల సిబ్బంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రావిపహాడ్ గ్రామానికి చెందిన ఓ యువకుడు మంగళవారం అర్ధరాత్రి కేజీబీవీ హాస్టల్ ప్రాంగణంలోకి ప్రహరి గోడ దూకి ప్రవేశించాడు. సుమారు రెండు గంటల పాటు హాస్టల్ ఆవరణలో ఉన్నట్లు సమాచారం.

సిబ్బందికి అనుమానం రావడంతో కొత్తగా నిర్మిస్తున్న భవనం వైపు వెళ్లి పరిశీలించగా, యువకుడు అక్కడి నుంచి గోడ దూకి పరారయ్యాడు. ఘటనపై సమాచారం అందుకున్న పాఠశాల ప్రిన్సిపాల్ క్రాంతి కుమారి మోతె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మోతె ఎస్సై లచ్చిరెడ్డి తెలిపారు.

బాలికల వసతి గృహాల భద్రతపై ఆందోళన

ఈ ఘటనతో కేజీబీవీ పాఠశాలల్లో బాలికల భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. వసతి గృహాల చుట్టూ పటిష్ఠమైన ప్రహరి గోడలు, రాత్రి వేళల్లో నిరంతర నిఘా, భద్రతా సిబ్బంది నియామకం వంటి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

అలాగే హాస్టల్‌ ప్రాంగణాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.