నేతాజీ విగ్రహానికి అవమానం..!

  • కీసరలో విగ్రహాన్ని తొలగించి కాలువ పక్కన పడేసిన ఘటన
  • వెంటనే పునఃప్రతిష్ఠించాలని స్థానికుల డిమాండ్

కంచికచర్ల, ఆంధ్రప్రభ: భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి కంచికచర్ల మండలంలోని కీసరలో అవమానం జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది. జాతీయ రహదారి పక్కన కీసర సెంటర్‌లో ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన నేతాజీ విగ్రహాన్ని కొందరు వ్యక్తులు షాపుల నిర్మాణం కోసం తొలగించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

అయితే విగ్రహాన్ని తొలగించిన అనంతరం దానిని సురక్షితమైన ప్రదేశంలో భద్రపరచకుండా, కాలువ పక్కన అపరిశుభ్రమైన ప్రాంతంలో నిర్లక్ష్యంగా పడవేయడం పలువురి ఆగ్రహానికి కారణమైంది. దేశ స్వాతంత్ర్యం కోసం సాయుధ పోరాటాన్ని చేపట్టి, “నాకు రక్తం ఇవ్వండి.. మీకు స్వేచ్ఛ ఇస్తాను” అనే నినాదంతో దేశ ప్రజల్లో జాతీయ భావాన్ని రగిలించిన మహనీయుడి విగ్రహాన్ని ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నేతాజీ విగ్రహాన్ని వెంటనే అక్కడి నుంచి తరలించి గౌరవప్రదంగా భద్రపరచాలని, అనంతరం తగిన స్థలాన్ని ఎంపిక చేసి తిరిగి ప్రతిష్ఠించాలని స్థానికులు, సామాజిక సంఘాల ప్రతినిధులు అధికారులను కోరుతున్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.