ప్రజల సమస్యల పరిష్కారమే ‘ఇంటింటికి టీడీపీ ’ లక్ష్యం…

ఎమ్మెల్యే గద్దె రామమోహన్


విజయవాడ, ఆగస్టు 6 (ఆంధ్రప్రభ): ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. గురువారం 5వ డివిజన్ పరిధిలోని క్రీస్తురాజపురం, అరుల్‌నగర్ ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందని అర్హుల వివరాలను సేకరించి సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరిస్తున్నామని తెలిపారు. స్త్రీశక్తి పథకం, తల్లికి వందనం వంటి పథకాలపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. గ్యాస్ సబ్సిడీ జమ కాని మహిళల వివరాలను వెంటనే సివిల్ సప్లైస్ అధికారులకు అందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రతి ఇంటికి సమయం కేటాయించి ప్రజలతో మాట్లాడడం ద్వారా వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గద్దె రామమోహన్ తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.