దళిత నాయకుడిని విమర్శించే స్థాయి నర్సింగ్‌కు లేదు

డాక్టర్ రాజా రమేష్‌పై వ్యాఖ్యలను ఖండించిన బీఆర్‌ఎస్‌వీ నేత బడికెల శ్రవణ్

క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ : దళిత నాయకుడి ముసుగులో మరో దళిత నాయకుడిపై విమర్శలు చేయడం సిగ్గుచేటని బీఆర్‌ఎస్‌వీ జిల్లా నాయకుడు బడికెల శ్రవణ్ అన్నారు.

రామకృష్ణాపూర్‌లోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పైడిమల్ల నర్సింగ్‌పై తీవ్రంగా స్పందించారు.

ప్రశ్నించడం అంబేద్కర్ మనకు ఇచ్చిన నైతిక హక్కు అని, అయితే ఏది పడితే అది మాట్లాడే హక్కు ఎవరికీ లేదని అన్నారు. కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్న వారిని చూసి దళిత సమాజం సిగ్గుపడుతోందని విమర్శించారు.

డాక్టర్ రాజా రమేష్‌ను ఆకాశంతో పోల్చిన శ్రవణ్, ఒకవైపు వైద్యుడిగా ప్రజలకు సేవ చేస్తూ, మరోవైపు ప్రజా సేవలో ముందుండి మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన అలాంటి వ్యక్తిని విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదని పేర్కొన్నారు.

పైడిమల్ల నర్సింగ్‌పై పలు ఆరోపణలు చేసిన ఆయన, ప్రజలను బెదిరిస్తూ, భూ పంచాయతీలు చేస్తూ సంపాదిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి తమ నాయకుడిని విమర్శించడం తగదని అన్నారు.

“ఆకాశం లాంటి మా అన్న రాజా రమేష్ ఎక్కడ, పాతాళంలో ఉన్న నువ్వు ఎక్కడ? ఒకసారి ఆలోచించు. నీ వెనుక ఉన్న విషయాలు ప్రజలకు తెలుసు” అని వ్యాఖ్యానించారు.

డాక్టర్ రాజా రమేష్, బాల్క సుమన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రస్తుతం తాము పొందుతున్న గుర్తింపు, హోదా బీఆర్‌ఎస్ నాయకుల సహకారంతో వచ్చిందని గుర్తుంచుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ జిల్లా నాయకులు కిరణ్ కుమార్, కొండ కుమార్, గాజుల చంద్ర కిరణ్, శ్రీకాంత్, శివ, మణి, కంది క్రాంతి, సాయి దేవి, మణి కుమార్, స్వరూప తదితరులు పాల్గొన్నారు.