లక్నవరం చెరువు నీటిని విడుదల చేయాలి
సాగునీటి కోసం తహసీల్దార్‌ను ఆశ్రయించిన ఆయకట్టు రైతులు
గోవిందరావుపేట, ఆంధ్రప్రభ : మండలంలోని లక్నవరం చెరువు ఆయకట్టు రైతులు గురువారం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించి, చెరువు నుంచి సాగునీటిని వెంటనే విడుదల చేయాలని కోరారు.
ఈ సందర్భంగా రైతు నాయకులు తుమ్మల వెంకట్‌రెడ్డి, గొల్లాల నర్సిరెడ్డి మాట్లాడుతూ లక్నవరం ఆయకట్టు పరిధిలో ఇప్పటికే దాదాపు 60 శాతం వరి నాట్లు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన రైతులు కూడా దుక్కులు సిద్ధం చేసుకుని నాట్లు వేసేందుకు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుతం లక్నవరం చెరువులో 22 అడుగుల మేర నీరు నిల్వ ఉందని, మరో మూడు అడుగుల నీరు చేరితే ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు పూర్తిస్థాయిలో సాగునీరు సరిపోతుందని తెలిపారు.
అయితే ఆలస్యం చేయకుండా ప్రస్తుతం ఉన్న నీటినే విడుదల చేస్తే మిగిలిన నాట్లు సకాలంలో పూర్తవుతాయని, రైతులు నష్టాల బారిన పడకుండా ఉంటారని అన్నారు.
భవిష్యత్తులో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోయినా, నీటి విడుదల వల్ల ఏర్పడే పరిస్థితులకు రైతులే బాధ్యత వహిస్తామని స్పష్టం చేశారు.
రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే నిర్ణయం తీసుకుని లక్నవరం చెరువు నుంచి సాగునీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆయకట్టు రైతులు వాసం స్వామి, గుండు రామస్వామి, చింతల లింగారెడ్డి, సోమ మల్లారెడ్డి, కాప కోటేశ్వరరావు, గుండు లెనిన్, బిక్షం తదితరులు పాల్గొన్నారు.
