లిటిల్ ఫ్లవర్ సోల్జర్స్ సేవలు ప్రారంభం

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించడమే లక్ష్యం

తొర్రూరు, ఆంధ్రప్రభ : పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో వినూత్నంగా ఏర్పాటు చేసిన లిటిల్ ఫ్లవర్ సోల్జర్స్ టీమ్ సేవలను ప్రారంభించడం అభినందనీయమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు.

లిటిల్ ఫ్లవర్ స్కూల్స్ యాజమాన్యం గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లిటిల్ ఫ్లవర్ సోల్జర్స్ టీమ్‌ను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవాభావం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.

విద్యార్థులు చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం, సామాజిక బాధ్యతలను అలవర్చుకుని భావి భారత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాల యాజమాన్యం చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని అభినందిస్తూ, విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని సూచించారు.

పాఠశాల కరస్పాండెంట్ ఏ. దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలలో ప్రారంభించిన లిటిల్ ఫ్లవర్ సోల్జర్స్ టీమ్ సేవల వివరాలను తెలిపారు.

పాఠశాలలు, కళాశాలల్లో ఉండే స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ తరహాలో సమాజానికి సేవలు అందించేందుకు ఈ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.

అత్యవసర సమయాల్లో సేవలు అందించేందుకు ప్రత్యేక ఫోన్ నంబర్‌ను ఏర్పాటు చేశామని, ఆ నంబర్‌కు సమాచారం అందిన వెంటనే విద్యార్థులు అక్కడికి చేరుకుని సహాయం చేస్తారని చెప్పారు. ఈ సేవల కోసం ఏర్పాటు చేసిన నంబర్‌ను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆవిష్కరించారు.

హాస్టల్‌లో ఉండే విద్యార్థులు, కోఆర్డినేటర్ అందుబాటులో ఉండడంతో అర్ధరాత్రి సమయంలో సమాచారం వచ్చినా సేవలు అందించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు.

ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, తుఫాన్లు వంటి విపత్తుల సమయంలో సహాయక చర్యలు చేపట్టేందుకు విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్లు వివరించారు.

రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాల సమయంలో ఎలా స్పందించాలి, తమను తాము రక్షించుకుంటూ ఇతరులకు ఎలా సహాయం చేయాలి అనే అంశాలపై కూడా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. త్వరలో అగ్నిమాపక శాఖ అధికారులతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.

అలాగే వైద్య అత్యవసర పరిస్థితుల్లో, అనారోగ్య సమయాల్లో సహాయం అందించడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాల్లో కూడా లిటిల్ ఫ్లవర్ సోల్జర్స్ పాల్గొంటారని తెలిపారు.

ప్రస్తుతం 25 మంది విద్యార్థులు ఈ సేవలపై శిక్షణ పొందారని, వీరిని చూసి మరికొంత మంది విద్యార్థులు కూడా సామాజిక సేవలో పాల్గొనేందుకు ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం విజయవంతమైతే మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంతాల్లోని తమ సోదర పాఠశాలల్లో కూడా ఇలాంటి విభాగాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.

విద్యార్థుల్లో సేవాభావం, దేశభక్తిని పెంపొందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.

కార్యక్రమం గురించి జిల్లా ఎస్పీకి సమాచారం అందించగా, పోలీస్ శాఖ అధికారులు స్పందించి డీఎస్పీ, సీఐ, ఎస్సైల ద్వారా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించారని తెలిపారు. అలాగే వైద్య శాఖ అధికారుల సహకారంతో స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ ఏ. విజయ్ కుమార్ అత్యవసర చికిత్స అందించే విధానంపై శిక్షణ ఇచ్చారని పేర్కొన్నారు.

సహకరించిన పోలీస్ శాఖ, ఆరోగ్య శాఖ అధికారులతో పాటు కార్యక్రమాన్ని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ దేవేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్, వైస్ చైర్మన్ సోమా రజిని రాజశేఖర్, కౌన్సిలర్ సురేష్, ఎస్సై మహేందర్ రెడ్డి, ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ ఏ. విజయ్ కుమార్, ఎంఈఓ మహంకాళి బుచ్చయ్యతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, ట్రస్మా ప్రతినిధులు కృష్ణ రవీంద్రనాథ్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అత్యవసర సేవల కోసం 9100100488 నంబర్‌కు సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు.