ప్రమాదం జరిగినా కుటుంబానికి ఆర్థిక అండ
- రూ.5 లక్షల వరకు ఉచిత బీమా
- మత్స్యకారులపై భారం లేకుండా ప్రభుత్వమే ప్రీమియం చెల్లింపు
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ: ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) కింద అమలు చేస్తున్న సమూహ ప్రమాద బీమా పథకం ద్వారా మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు గురువారం మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
సముద్రం, నదులు, జలాశయాలపై చేపల వేటపై ఆధారపడి జీవించే మత్స్యకారులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా, ప్రతి సభ్యుడి తరఫున చెల్లించాల్సిన రూ.79.96 ప్రీమియాన్ని ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని మంత్రి వెల్లడించారు.
18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల మత్స్యకారులు, చేపల రైతులు, వేట వృత్తికి అనుబంధంగా జీవనం సాగించే వారందరికీ ఈ ఉచిత బీమా వర్తిస్తుందని తెలిపారు.
వేట సమయంలో లేదా ఇతర ప్రమాదాల్లో మరణించినా, శాశ్వత సంపూర్ణ వైకల్యం పొందినా బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు బీమా పరిహారం అందుతుందని చెప్పారు. శాశ్వత పాక్షిక వైకల్యం కలిగితే రూ.2.50 లక్షలు, ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి వస్తే వైద్య ఖర్చుల కోసం రూ.25 వేల వరకు బీమా సాయం అందజేస్తామని వివరించారు.
రోడ్డు, రైలు, అగ్నిప్రమాదాలు, నీటిలో మునిగిపోవడం, విద్యుత్ షాక్, యంత్రాల ప్రమాదాలు, పాముకాటు, విషకీటకాల కాటు, అడవి జంతువుల దాడులు వంటి అనేక రకాల ప్రమాదాలకు ఈ బీమా వర్తిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
ప్రమాదం జరిగిన 120 రోజులలోపు క్లెయిమ్ సమాచారాన్ని అందజేసి, 180 రోజులలోపు అవసరమైన పత్రాలతో దరఖాస్తు సమర్పిస్తే, 90 రోజుల్లోనే క్లెయిమ్‌ను పరిష్కరించి ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు.
పథకానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మత్స్యకారులు టోల్‌ఫ్రీ నంబర్ 1800-425-1660, ల్యాండ్‌లైన్ 040-24000109ను సంప్రదించవచ్చని, అలాగే సంబంధిత అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా సమాచారం పొందవచ్చని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు.
