పీసీపీఎన్‌డీటీ చట్ట ఉల్లంఘనలకు కఠిన శిక్షలు

  • మాతా శిశు మరణాలు తగ్గాలి
  • లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
  • యాక్ట్ పై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలి
  • జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో: జిల్లాలో మాతా శిశు మరణాల రేటును పూర్తిగా తగ్గించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాతా, శిశు మరణాలపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

మాతా శిశు మరణాలపై జిల్లా కమిటీ సభ్యులతో కలిసి ఆయన లోతుగా విచారణ చేపట్టారు. మాతృ మరణాలకు గల ప్రాథమిక వైద్య కారణాలు, క్షేత్రస్థాయి నుంచి అందించిన ఆరోగ్య సేవలు, వివిధ ఆసుపత్రుల్లో లభించిన చికిత్స తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ ఆరా తీశారు. గర్భిణులకు హిమోగ్లోబిన్, బీపీ వంటి కీలక పరీక్షలతో పాటు అన్ని ల్యాబ్ టెస్టులు సకాలంలో పూర్తి చేయాలన్నారు.

గర్భిణుల స్కానింగ్ నివేదికలను తప్పనిసరిగా జనరల్ ఫిజీషియన్లకు చూపించి వైద్య పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. గర్భధారణ సమయంలో ప్రమాదకర లక్షణాలు కనిపిస్తే తక్షణమే అప్రమత్తమై తగిన వైద్య సలహాలు, చర్యలు తీసుకోవాలని సూచించారు. శిశు మరణాల నివారణకు సైతం పలు కీలక సూచనలు చేశారు.

లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, చేయించుకోవడం లేదా ప్రోత్సహించడం నేరమని, ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 50,000 రూపాయిల వరకు వరకు జరిమానా విధిస్తామనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం కల్పించాలని అన్నారు.

జిల్లాలో అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో 50శాతం కన్నా ఎక్కువ జరుగుతున్న సిజేరియన్ ఆపరేషన్లపై తగు వివరణ ఇవ్వాలని సూచించారు. జిల్లాలో ఎక్కడా భ్రూణహత్యలు జరగడానికి వీల్లేదని జాయింట్ కలెక్టర్ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే వైద్య ఆరోగ్యశాఖ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనివేళల్లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉండి రోగులకు ఉత్తమ సేవలు అందించాలని నిర్దేశించారు. పి.సి.పి.యన్.డి.టి చట్టం 1994ను సమర్థవంతంగా అమలుచేయడానికి ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమన్నారు.

జిల్లాలో ఎవరైనా పి.సి.పి.యన్.డి.టి చట్టాన్ని ఉల్లంఘిస్తే టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1800 2332447 కు ఫోన్ చేయాలని సూచిస్తూ సంబంధిత పోస్టర్ విడుదల చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో ఐ.సి.డి.యస్. పి.డి. సుగుణ, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి,(ఇన్చార్జి) టి శ్రీకాంత్, సీనియర్ రిటైర్డు జడ్జి పప్పల జగన్నాథం, డి. ఐ. ఓ . రామ్ దాస్, డి.సి .హెచ్ .ఎస్. డ విజయలక్ష్మి, ఆర్ .బి. ఎస్. కె. ప్రోగ్రాం అధికారి శివరంజని, డిపిఎమ్ఓ బి రవీంద్ర, రిమ్స్ వైద్యులు .. ఆర్ శిరీష, . రాజేష్, డిప్యూటీ డెమో కె.యర్రన్న, డిప్యూటీ హెచ్.ఇ.ఓ.పి. మోహిని రత్నకుమారి, కమిటీ మెంబర్లు, పలువురు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.