ఆచార్య జయశంకర్ ఆశయాల సాధనకు కృషి చేద్దాం

కలెక్టర్ కె. హరిత

ఆసిఫాబాద్, ఆంధ్రప్రభ: మలి దశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు.

గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం. డేవిడ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్డే అనిల్, ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకాష్, వైస్ చైర్‌పర్సన్ ఎం.డి. అహ్మద్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రతినిధి అలీబిన్ అహ్మద్, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంగలతో కలిసి పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కె. హరిత మాట్లాడుతూ, ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధనకు సిద్ధాంతపరమైన బలాన్ని అందించి, మలి దశ ఉద్యమంలో ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చిన మహనీయుడని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి నదీమ్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.