డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి
- మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి
- వైఎస్సార్సీపీ నేతల డిమాండ్
మైలవరం, ఆంధ్రప్రభ: మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతిని అమలు చేయాలని కోరారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా, మాజీ మంత్రి, మైలవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి జోగి రమేష్ ఆదేశాల మేరకు గురువారం మైలవరం పట్టణంలోని ఎల్బీహెచ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం సమీపంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను మైలవరం నియోజకవర్గ పరిశీలకురాలు బండి పుణ్యషీల ప్రారంభించారు.
ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన ఈ దీక్షల్లో నియోజకవర్గంలోని విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, పార్టీ ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పామార్తి శ్రీనివాసరావు,నాగాలూరి దుర్గాప్రసాద్,దేవరకొండ ఆంజనేయులు, పాల నారాయణరెడ్డి, చామల సీతారామిరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత, నిరుద్యోగుల పెద్దఎత్తున పాల్గొని రిలే నిరాహార దీక్షలు విజయవంతం చేశారు.
