ఇంద్రకీలాద్రిపై వారాంత రద్దీకి పటిష్ట ఏర్పాట్లు

ఇంద్రకీలాద్రిపై వారాంత రద్దీకి పటిష్ట ఏర్పాట్లు
-ప్రత్యేక దర్శనం టికెట్ల జారీపై సమయ పరిమితి
-రద్దీ సమయంలో అంతరాలయం పై ఆంక్షలు.
-వేగవంతమైన దర్శనానికి మార్పులు
-రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు
-అదనపు సిబ్బంది నియామకం, కఠిన పర్యవేక్షణ
-పారిశుధ్యం, తాగునీటి సదుపాయాల బలోపేతం
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: వేసవి సెలవులు, వరుస వారాంతపు రోజులను దృష్టిలో ఉంచుకుని విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగే అవకాశాన్ని ముందుగానే అంచనా వేసిన ఆలయ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సమన్వయంతో పనిచేయాలని కార్యనిర్వహణాధికారి శీన నాయక్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
వారాంతంలో భారీ రద్దీ..
ఏప్రిల్ 24, 25, 26 తేదీల్లో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశముండటంతో దర్శన వ్యవస్థలో కీలక మార్పులు చేశారు. ప్రత్యేక దర్శనం టికెట్లను ఉదయం 9:30 గంటలకే నిలిపివేసి, అప్పటికే టికెట్లు పొందిన భక్తుల దర్శనాన్ని ఉదయం 10:30 గంటలకల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఉదయం 10:30 గంటలకు అంతరాలయంలోని చిన్న గేట్లు మూసివేసి, ముఖ మండపం ద్వారా దర్శనాన్ని నిర్వహించడం ద్వారా భక్తులు వేగంగా కదిలేలా చర్యలు చేపడుతున్నారు. దీని ద్వారా క్యూలైన్లలో గడిపే సమయం తగ్గించాలనే లక్ష్యంతో ఈ విధానం అమలు చేస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే రావి చెట్టు ప్రాంతంలో ప్రత్యేక నియంత్రణ చర్యలు చేపట్టాలని సెక్యూరిటీ, ప్రోటోకాల్ సిబ్బందికి స్పష్టమైన సూచనలు జారీ చేశారు. భక్తులు గుమిగూడకుండా క్రమబద్ధంగా క్యూలైన్లలోనే కదిలేలా పర్యవేక్షణను కట్టుదిట్టం చేస్తున్నారు.
సిబ్బందికి అదనపు విధులు..
చెప్పుల స్టాండ్లు, మొబైల్ డిపాజిట్ కౌంటర్లు, బ్యాగ్ కౌంటర్లు, కొబ్బరికాయలు కొట్టే ప్రదేశాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు హోంగార్డులు, సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. కౌంటర్ల వద్ద అధిక రుసుములు వసూలు కాకుండా లీజుల విభాగం ఉదయం 7 గంటల నుంచే నిరంతర నిఘా పెట్టాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వేసవి ఉపశమనానికి చర్యలు..
అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు వేసవి నుండి ఉపవాసం కల్పించేలా పారిశుధ్యం, తాగునీటి సదుపాయాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ప్రసాదం కౌంటర్లు, క్యూలైన్లు, మరుగుదొడ్ల వద్ద శుభ్రతను నిరంతరం నిర్వహించాలని శానిటేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కొండపై, కొండకింద అదనపు చలివేంద్రాలు ఏర్పాటు చేసి భక్తులకు తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు కలగకుండా కనకదుర్గా నగర్ సహా ముఖ్య ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచే నేలపై నీరు చల్లాలని ఆదేశించారు.
వేడి కారణంగా భక్తుల పాదాలు కాలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డ్యూటీకి నియమితులైన సిబ్బంది అందరూ ఉదయం 7 గంటలకల్లా తమ కేటాయించిన పాయింట్లలో హాజరై సమయపాలనతో సేవలందించాలని కార్యనిర్వహణాధికారి స్పష్టం చేశారు. వేసవి కాలం ముగిసే వరకు ప్రతి వారాంతంలో ఇదే విధానాన్ని కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.
