మహిళా సాధికారతకు కేంద్రం పెద్దపీట

  • ఏపీలో సూక్ష్మ పరిశ్రమలకు మరింత ఊతం
  • లోక్‌సభలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రశ్నకు కేంద్రం సమగ్ర సమాధానం
  • గత ఐదేళ్లలో 42,211 నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు
  • 19.54 లక్షల మందికి శిక్షణ
  • 6.66 లక్షల మంది మహిళలకు ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించిన కేంద్రం
  • కృష్ణా జిల్లాలో మూడు క్లస్టర్ ప్రాజెక్టులు పూర్తి
  • మరో రెండు పనులు పురోగతిలో
  • రాష్ట్రాలతో సమన్వయంతో క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాల వేగవంతం: కేంద్రం

విజయవాడ, ఆంధ్రప్రభ: సూక్ష్మ, చిన్న పరిశ్రమల అభివృద్ధితో పాటు మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాధికారత కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. లోక్‌సభలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అడిగిన ప్రశ్నకు ఆమె లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ దేశవ్యాప్తంగా అమలవుతున్న మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్–క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ పురోగతి, మహిళా సాధికారత, ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న క్లస్టర్ ప్రాజెక్టులపై సమగ్ర వివరాలు వెల్లడించారు.

ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం, సూక్ష్మ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడం, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని సమాధానంలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆమోదించిన క్లస్టర్ ప్రాజెక్టుల పురోగతి, నిధుల కేటాయింపు, గ్రాంట్ల విడుదల, పనుల అమలు, మహిళా పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న శిక్షణ వంటి అంశాలపై ఎంపీ చిన్ని లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్రం పూర్తి వివరాలు సమర్పించింది. మహిళల ఆర్థిక స్వావలంబనకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర మంత్రి వెల్లడించారు.

గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 42,211 నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించగా, 19,54,701 మంది శిక్షణ పొందినట్లు తెలిపారు. వీరిలో 6,66,327 మంది మహిళలు ఉండటం విశేషమన్నారు. వస్త్ర పరిశ్రమతో పాటు వివిధ రంగాల్లో మహిళలు స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించుకునేలా ప్రత్యేక శిక్షణ, క్లస్టర్ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి పలు క్లస్టర్ ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తయ్యాయని కేంద్రం వెల్లడించింది. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ఇమిటేషన్ జ్యువెలరీ క్లస్టర్, విజయవాడ గోల్డ్ ఆర్నమెంట్ క్లస్టర్, జగ్గయ్యపేట గోల్డ్ ఆర్నమెంట్ క్లస్టర్ పూర్తయ్యాయని పేర్కొంది.

అలాగే మచిలీపట్నం జ్యువెలరీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అప్‌గ్రేడేషన్, గన్నవరం మండలం వీరపనేనిగూడెం న్యూ ఇండస్ట్రియల్ ఎస్టేట్ (ఫేజ్–III) పనులు ప్రస్తుతం కొనసాగుతున్నట్లు స్పష్టం చేసింది. క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎదురయ్యే సమస్యలను రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత అమలు సంస్థలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పరిష్కరిస్తున్నామని కేంద్రం తెలిపింది. ఆమోదించిన ప్రతి ప్రాజెక్టు నిర్ణీత గడువులో పూర్తి కావడానికి నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నట్లు మంత్రి సమాధానంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ, సూక్ష్మ, చిన్న పరిశ్రమల బలోపేతం, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, ఉపాధి అవకాశాల విస్తరణకు సంబంధించిన అంశాలను పార్లమెంట్‌లో నిరంతరం ప్రస్తావిస్తూనే ఉంటానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాలు ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధికి, ముఖ్యంగా కృష్ణా జిల్లా క్లస్టర్ ప్రాజెక్టులకు మరింత ఊతం లభిస్తుందనే ఆశాభావాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.