కేంద్ర విధానాలకు నిరసనగా సీపీఐ పాదయాత్ర
హామీల అమలు చేయాలని డిమాండ్.. కరపత్రాల పంపిణీ
భూపాలపల్లి టౌన్, ఆంధ్రప్రభ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఎన్నికల హామీలను విస్మరించిందని సీపీఐ పట్టణ కార్యదర్శి సొత్కూ ప్రవీణ్ విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్న పాదయాత్రలో భాగంగా గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ నాయకులు పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రజలను కలిసి కేంద్ర ప్రభుత్వం అమలు చేయని హామీలు, ప్రజా సమస్యలపై కరపత్రాలు పంపిణీ చేస్తూ అవగాహన కల్పించారు.
విద్య, వైద్య రంగాలను బలోపేతం చేసి ప్రతి ఒక్కరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని, రైతులకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యుడు చంద్రమౌళి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
