ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలు వైభవం
- మూడో రోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు పులివర్తి నాని, మురళీమోహన్ దంపతులు
- స్వామివారికి పట్టు వస్త్రాలు, మంగళ ద్రవ్యాల సమర్పణ
చంద్రగిరి, ఆంధ్రప్రభ: శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారి 78వ ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలు మూడో రోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు విశిష్ట అతిథులుగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి మంగళ ద్రవ్యాలు, పట్టు వస్త్రాలను సమర్పించారు.
అదే విధంగా, కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం తరఫున పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ దంపతులు సుబ్రహ్మణ్యస్వామికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
మంగళ వాయిద్యాలు, చెక్కభజనలు, కోలాటాలు, పిల్లనగ్రోవి తాళాలు, వేదపండితుల వేదమంత్రోచ్చరణల మధ్య ఎమ్మెల్యే దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వేడుకల్లో పాల్గొన్న భక్తులు “వేల్ మురుగన్ కి హరోహర” అంటూ నామస్మరణ చేయడంతో ఆలయ ప్రాంగణం భక్తిరసంలో మునిగిపోయింది.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారు.

