మెదక్ అభివృద్ధికి ఎమ్మెల్యే రోహిత్ ప్రత్యేక చొరవ

రూ.1.6 కోట్లతో 13వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం

మెదక్, ఆంధ్రప్రభ: మెదక్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు నిరంతరం కృషి చేస్తున్నారని మున్సిపల్ ఛైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతిరాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ పేర్కొన్నారు.

గురువారం మెదక్ పట్టణంలోని 13వ వార్డులో రూ.1.60 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు వారు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అభివృద్ధి అంటే కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా ప్రజల జీవితాల్లో కనిపించే మార్పుగా ఉండాలని అన్నారు.

పట్టణంలోని ప్రతి వార్డుకు పార్టీలకు అతీతంగా సమాన ప్రాధాన్యం కల్పిస్తూ, నాణ్యమైన రహదారులు, డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

13వ వార్డు ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభం కావడం సంతోషకరమని పేర్కొన్నారు. పనులు పూర్తయిన అనంతరం ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు నాయకత్వంలో మెదక్ పట్టణంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చెదల్ సంధ్య నవీన్ కుమార్, అస్తరుగల్ల బాలరాజ్, రాజశేఖర్, అరుణ, సిద్ధిరాములు, కో-ఆప్షన్ సభ్యురాలు అనూష, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.