ఆగస్టు 10 నాటికి సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
పీఎం కుసుమ్ పథకం ప్లాంట్‌ను గడువులోగా అందుబాటులోకి తేవాలని కలెక్టర్ ఆదేశం
కాల్వశ్రీరాంపూర్, ఆంధ్రప్రభ: పీఎం కుసుమ్ పథకం కింద నిర్మించిన 1 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌కు సంబంధించిన మిగిలిన ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి ఆగస్టు 10 నాటికి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం మండలంలోని సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను కలెక్టర్ పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు. ప్లాంట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, విద్యుత్ ఉత్పత్తి ప్రారంభానికి అవసరమైన విద్యుత్ కనెక్షన్లు, సాంకేతిక ప్రక్రియలను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు.
పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడంలో ఇలాంటి సోలార్ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులో ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూనే మిగిలిన అన్ని ప్రక్రియలను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాముడు, పీఏసీఎస్ చైర్మన్ రాంచందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మామిడి తిరుపతి రెడ్డి, పీఏసీఎస్ సీఈవో కోలేటి శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
