రాజన్న గోశాలలో శ్రమదానం..

వేములవాడ, ఆంధ్రప్రభ ; రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో ఉన్న తిప్పాపురం గోశాలలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రైతులు విరాళంగా అందించిన సుమారు 70 టన్నుల ఎండు గడ్డిని గోశాలలో భద్రపరిచే కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున శ్రమదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి గారి ఆధ్వర్యంలో ఈఈ, ఏఈ, ఏఈఓలు, పర్యవేక్షకులు, ఔట్సోర్సింగ్ సిబ్బంది మరియు కిందిస్థాయి ఉద్యోగులు ఉదయం 6 గంటల నుంచే పాల్గొని గడ్డి కట్టలను గోశాలలో సక్రమంగా వేరు చేసి నిల్వ చేశారు.
మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా సేవాభావంతో పనిచేసిన సిబ్బందిని ఈవో శ్రీమతి రమాదేవి గారు ప్రత్యేకంగా అభినందించారు. గోమాత సేవ భారతీయ సంస్కృతిలో విశిష్ట స్థానం కలిగి ఉందని, దేవస్థానం పరిధిలోని గోశాలలో పశువుల సంరక్షణకు అన్ని విధాల చర్యలు చేపడుతున్నామని ఈ సందర్భంగా ఈవో తెలిపారు. భక్తులు, రైతులు అందిస్తున్న సహకారంతో గోశాల అభివృద్ధి మరింత బలోపేతం అవుతోందన్నారు.
వేములవాడ దేవస్థానం కేవలం ఆధ్యాత్మిక సేవలకే పరిమితం కాకుండా గోసంరక్షణ, అన్నదానం, పర్యావరణ పరిరక్షణ వంటి సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. తిప్పాపురం గోశాలలో నిర్వహించిన ఈ శ్రమదానం కార్యక్రమం ఆలయ సేవా తత్వానికి నిదర్శనంగా నిలిచిందన్నారు.
