సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణ

సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణ

  • టెక్నాలజీ వినియోగంతో మంచి ఫలితాలు
  • శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత
  • ప్రభుత్వ విప్ విజయరమణారావు

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని, సీసీ కెమెరాల ఏర్పాటుతో మరింత ఉపయోగం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడను, శాంతి భద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝాతో కలిసి ప్రభుత్వ విప్ విజయరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగతనాలు, హత్యలు ఇతరత్రా సంఘటనల్లో వెంటనే నిందితులను పట్టుకోవడంలో పోలీసులు టెక్నాలజీని చాలా వరకు వినియోగించుకుంటున్నారని అభినందించారు.

ప్రజా పాలనలో శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా అవినీతికి తావు లేకుండా పోలీస్ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వడం జరుగుతోందని స్పష్టం చేశారు. తద్వారా పోలీస్ స్టేషన్లలో అవినీతి అనేది లేకుండా పోయిందని చెప్పారు. పెద్దపల్లి నియోజకవర్గంలో పోలీసు అధికారులు, సిబ్బంది నేరాల నియంత్రణకు నిర్విరామ కృషి చేస్తున్నారని చెప్పారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నాలుగు పోలీస్ స్టేషన్లకు కొత్త భవనాలు నిర్మించనున్నట్టు చెప్పారు. అలాగే ఏసీపీ కార్యాలయానికి కూడా నూతన భవనానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో డీసీపీ రాంరెడ్డి, ఏసీ పీ కృష్ణతోపాటు పోలీస్ అధికారులు, మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply