చౌటుప్పల్‌లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమన్న మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో డ్రైనేజీ, సీసీ రోడ్లు, వాటర్ పైప్‌లైన్ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ గురువారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఆయా వార్డుల కౌన్సిలర్లతో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించారు.

4వ వార్డులో జిట్ట ఎల్లయ్య ఇంటి వద్ద డ్రైనేజీ నిర్మాణ పనులకు కౌన్సిలర్ ఊదరి యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్యతో కలిసి భూమిపూజ చేశారు. 5వ వార్డులో బలమోని జంగయ్య ఇంటి వద్ద నూతన డ్రైనేజీ నిర్మాణ పనులను కౌన్సిలర్ కోయ్యడ శేఖర్ గౌడ్‌తో కలిసి ప్రారంభించారు.

6వ వార్డులో కేతరాజు అంజయ్య ఇంటి వద్ద సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కౌన్సిలర్ ఆలే శ్రీలత చిరంజీవితో కలిసి శంకుస్థాపన చేశారు. 15వ వార్డులో అరిగే జంగయ్య ఇంటి వద్ద డ్రైనేజీ నిర్మాణ పనులను కౌన్సిలర్ గడ్డం ఇందిరా రాజరత్నంతో కలిసి ప్రారంభించారు.

16వ వార్డులో చెరుకుబావి ఏరియా రోడ్ నంబర్–40లో నూతన డ్రైనేజీ నిర్మాణ పనులకు కౌన్సిలర్లు బత్తుల జయమ్మ దాసు, మహమ్మద్ హన్నుతో కలిసి భూమిపూజ నిర్వహించారు. 17వ వార్డులో కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలుతో కలిసి వాటర్ పైప్‌లైన్ పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. పట్టణంలోని అన్ని వార్డులను సమగ్రంగా అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆయా వార్డుల ప్రజలు పాల్గొన్నారు.