ఎల్లంపేట్ మున్సిపాలిటీలో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు
తెలంగాణ సిద్ధాంతకర్తకు ఘన నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు
మేడ్చల్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను మేడ్చల్ మండల పరిధిలోని ఎల్లంపేట్ మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఆచార్య జయశంకర్ చిత్రపటానికి మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడియా శ్రీదేవి రమేష్ నాయక్, మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు పుష్పాంజలి ఘటించి ఆయన తెలంగాణ ఉద్యమానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ లావుడియా శ్రీదేవి రమేష్ నాయక్, మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను, నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన వివక్షను ప్రజలకు స్పష్టంగా వివరించిన మహానీయుడు ఆచార్య జయశంకర్ అని కొనియాడారు. విద్యార్థి దశ నుంచే తెలంగాణ ఆకాంక్షను ప్రజల్లో నాటుతూ, జీవితాంతం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కృషి చేశారని గుర్తు చేశారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి ఆయన వేసిన పునాదులే ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి బాటలు వేసాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు, అధికారులు, కౌన్సిలర్లు, వివిధ విభాగాల సెక్షన్ అధికారులు, వార్డు అధికారులు, మున్సిపల్ ఉద్యోగులు, స్థానిక ప్రజలు పాల్గొని ఆచార్య జయశంకర్‌కు ఘనంగా నివాళులర్పించారు.
