సాంఘిక శాస్త్రం బోధించే టీచర్ లేక విద్యార్థుల అవస్థలు

వరుస పదవీ విరమణలతో రెండు కీలక పోస్టులు ఖాళీ

బాల్కొండ,ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే సరిపడా ఉపాధ్యాయులు ఉండటం అత్యంత అవసరం.కానీ నిజామాబాద్ జిల్లా బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉర్దూ మాధ్యమ విద్యార్థులకు మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది.

కీలక సబ్జెక్టులను బోధించే ఇద్దరు ఉపాధ్యాయులు పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఖాళీలు భర్తీ కాకపోవడంతో విద్యార్థుల చదువులుగాడితప్పుతున్నాయి. ముఖ్యంగా ఉర్దూలో సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు లేకపోవడంతో పదో తరగతి విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పాఠశాలలో ఉర్దూ మాధ్యమ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అలీమ్ 2025 మార్చిలో పదవీ విరమణ చేయగా, మరో ఉపాధ్యాయుడు 2026 జూన్‌లో స్కూల్ అసిస్టెంట్,ఉర్దూ ఉపాధ్యాయుడు వకీల్ కూడా పదవీ విరమణ చేశారు.

అప్పటి నుంచి ఈ పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఉర్దూ మాధ్యమ బోధనకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది.ఉర్దూ మాధ్యమ విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు అందించినప్పటికీ వాటిని ఉర్దూ భాషలో బోధించే ఉపాధ్యాయులు లేకపోవడంతో స్వయంగా చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా సాంఘిక శాస్త్రం వంటి భావనాత్మక సబ్జెక్టును ఉపాధ్యాయుడి సహాయం లేకుండా అర్థం చేసుకోవడం కష్టమవుతోందని విద్యార్థులు వాపోతున్నారు.దీంతో సిలబస్ పూర్తి కావడం,పరీక్షలకు సన్నద్ధం కావడం,ఉత్తీర్ణత శాతంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఉర్దూ మాధ్యమ విద్యార్థులు కూడా ఇతర మాధ్యమాల విద్యార్థులతో సమానంగా నాణ్యమైన విద్య పొందే హక్కు ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేసి ఉర్దూ భాషలో బోధించే అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు,స్థానిక ప్రజాప్రతినిధులు విద్యాశాఖ ఉన్నతాధికారులను కోరుతున్నారు. ఆలస్యం చేస్తే విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.

చదవాలంటే పుస్తకం ఉంది..! బోధించేందుకు టీచర్ లేరు..!!

పాఠ్యపుస్తకాలు ఉన్నాయి… సిలబస్ ఉంది… చదవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు కూడా ఉన్నారు. కానీ వాటిని ఉర్దూలో బోధించే ఉపాధ్యాయుడు మాత్రం లేడు. దీంతో విద్యార్థులు స్వయంగా పాఠాలు చదువుకుంటూ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. వెంటనే ఖాళీలను భర్తీ చేసి ఉర్దూ మాధ్యమ విద్యార్థులకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.