జనగణనకు పకడ్బందీ సన్నాహాలు..

  • ఖచ్చితమైన గణాంకాలే అభివృద్ధికి పునాది
  • ఎన్టీఆర్ కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ
  • జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్‌ను ప్రామాణిక పత్రంగా తీర్చిదిద్దాలి
  • మండల స్థాయి అధికారులు పూర్తి బాధ్యతతో భాగస్వాములు కావాలి
  • క్షేత్రస్థాయిలో నాణ్యమైన సమాచార సేకరణకు ప్రాధాన్యం
  • శిక్షణ, పర్యవేక్షణ, ధృవీకరణ ప్రక్రియలను పటిష్ఠం చేయాలి
  • జనగణన–2027 సన్నాహక కార్యక్రమాలపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం

విజయవాడ, ఆంధ్రప్రభ: జనగణన–2027 సన్నాహక కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేసి, క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన సమాచార సేకరణ ద్వారా నాణ్యమైన గణాంకాలను సిద్ధం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్ జిల్లా అభివృద్ధి ప్రణాళికలకు అత్యంత ప్రామాణిక ఆధార పత్రంగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు.

స్థానిక కలెక్టరేట్‌లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్ నమోదుపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామాలు, పట్టణాల్లోని సామాజిక, ఆర్థిక పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటేనే భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను సమర్థవంతంగా రూపొందించవచ్చని తెలిపారు.

జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్ తయారీ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు చురుకుగా భాగస్వాములు కావాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సేకరించిన ప్రతి వివరాన్ని సంబంధిత శాఖల ద్వారా ధృవీకరించిన తర్వాతే నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే క్షేత్రస్థాయి సిబ్బందికి విడతల వారీగా శిక్షణ ఇవ్వడంతో పాటు, నిరంతర పర్యవేక్షణ, ఫాలోఅప్ వ్యవస్థలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

జనగణన ప్రక్రియలో అన్ని శాఖల మధ్య సమన్వయంతో సమాచార సేకరణ చేపట్టి, ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా విశ్వసనీయ గణాంకాలతో జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్‌ను అత్యంత ప్రామాణిక పత్రంగా రూపొందించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సహాయ స్టాటిస్టికల్ అధికారి మేక స్వాతి మాస్టర్ ట్రైనర్‌గా వ్యవహరించారు.