అసైన్డ్ భూముల ఆక్రమణలకు చెక్..
15 రోజుల్లో విచారణ పూర్తి చేసి అర్హుల పేర్లు నమోదు చేయాలి.
క్షేత్రస్థాయిలో పరిశీలించిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు.
బాధితులకు చట్టబద్ధంగా న్యాయం చేయాలని అధికారులకు ఆదేశాలు
కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ : షెడ్యూల్డ్ కులాలకు ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూముల పరిరక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని, భూ హక్కులను కాపాడడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు మేకల బిక్షం (దాసు), డాక్టర్ పి. గౌతమ్ రాజు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలోని కల్లూరు, ఓర్వకల్లు మండలాల్లో అసైన్డ్ భూములకు సంబంధించిన ఫిర్యాదులపై బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించిన వారు, బాధితులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో రికార్డుల పరిశీలన..
ఫిర్యాదులపై నేరుగా గ్రామాలకు వెళ్లిన కమిషన్ సభ్యులు భూముల ప్రస్తుత పరిస్థితి, రెవెన్యూ రికార్డులు, సరిహద్దులు, గతంలో చేపట్టిన పరిపాలనా చర్యలపై అధికారుల నుంచి సమగ్ర వివరాలు సేకరించారు. బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి వాదనలు తెలుసుకోవడంతో పాటు వివాదాల వాస్తవ పరిస్థితులను పరిశీలించి అవసరమైన సూచనలు జారీ చేశారు.
పందిపాడులో అసైన్డ్ భూమిపై విచారణ..

కల్లూరు మండలం పందిపాడు గ్రామంలోని సర్వే నెం. 26/ఏ 2లో 0.90 సెంట్ల అసైన్డ్ భూమికి సంబంధించి ఎం.ఎస్. ఆంజనేయులు చేసిన ఫిర్యాదును కమిషన్ సభ్యులు పరిశీలించారు. భూమి కేటాయింపు, రెవెన్యూ రికార్డులు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అధికారులను ప్రశ్నించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా చట్టబద్ధంగా విచారణ పూర్తి చేసి తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
ఉసేనాపురంలో ఆన్లైన్ రికార్డులపై ఆందోళన..
ఓర్వకల్లు మండలం ఉసేనాపురం గ్రామంలోని సర్వే నెం. 721లో 5 ఎకరాల అసైన్డ్ భూమికి సంబంధించిన రాజా పోగు మద్దయ్య ఫిర్యాదును కూడా కమిషన్ సభ్యులు పరిశీలించారు. భూమి స్వాధీనం, రికార్డులు, సరిహద్దులు, వివాదానికి దారితీసిన పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన అసైన్డ్ భూమికి సంబంధించిన ఆన్లైన్ రికార్డుల్లో ఇతరుల పేరు నమోదవడంపై కమిషన్ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి 15 రోజుల్లో సమస్యను పరిష్కరించి అర్హులైన బాధిత కుటుంబం పేరును ఆన్లైన్ రికార్డుల్లో నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
భూ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది..
అసైన్డ్ భూములకు సంబంధించిన ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారించి సంబంధిత చట్టాలు, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కమిషన్ సభ్యులు సూచించారు. భూ హక్కుల పరిరక్షణలో నిర్లక్ష్యానికి అవకాశం ఉండకూడదని, ప్రతి అంశాన్ని బాధ్యతాయుతంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయం, షెడ్యూల్డ్ కులాల భూ హక్కుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోందని, ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వర పరిష్కారానికి రాష్ట్ర ఎస్సీ కమిషన్ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ పరిశీలనపై సమగ్ర నివేదికను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్కు సమర్పించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో సందీప్ కుమార్, కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు, ఓర్వకల్లు తహసీల్దార్ విద్యాసాగర్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.
