సైబర్ మోసాలకు చెక్..
విద్యార్థులతో ఎస్పీ అవగాహన ర్యాలీ
అప్రమత్తతతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చన్న ఎస్పీ మహేశ్ బి. గితే
సిరిసిల్ల, ఆంధ్రప్రభ: విద్యార్థి దశ నుంచే సైబర్ మోసాలపై అవగాహన పెంపొందించడం ద్వారా సైబర్ సురక్షిత తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి. గితే పిలుపునిచ్చారు.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో స్వాతంత్ర్య మాసోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ‘సురక్ష కా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ’ కార్యక్రమంలో భాగంగా బుధవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్ వరకు విద్యార్థులతో కలిసి సైబర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులను సైబర్ మోసాల పట్ల అప్రమత్తం చేయడమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, విద్యాసంస్థల్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసగిస్తున్నారని, అత్యాశకు లోనుకాకుండా వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఓటీపీలు, పాస్‌వర్డ్లు ఎవరికీ చెప్పవద్దని సూచించారు. ప్రజల అప్రమత్తతే సైబర్ నేరాల నివారణకు ప్రధాన ఆయుధమని, అవగాహన ద్వారానే వాటిని సమర్థవంతంగా అరికట్టవచ్చన్నారు.
సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ తదితర వేదికల ద్వారా వచ్చే పెట్టుబడులు, ఉద్యోగాలు, స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్, బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో చేసే మోసాలు, డిజిటల్ అరెస్ట్ కాల్స్, లోన్ యాప్‌ల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అనుమానాస్పద కాల్స్ లేదా సందేశాలు వచ్చిన వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. ముఖ్యంగా సైబర్ మోసానికి గురైన వెంటనే మొదటి గంటలోనే ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును నిలిపివేసి తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు.
విద్యార్థులు సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని, అపరిచితుల నుంచి వచ్చే సందేశాలు, లింకులు, స్నేహ అభ్యర్థనలకు స్పందించవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు గణేష్, నాగరాజు, జునైద్, సైబర్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
