ఎస్‌ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తున్నాం..

  • ఈఆర్‌వో రామ్మోహన్

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎస్‌ఐఆర్-2026 కార్యక్రమంలో భాగంగా 149-ఉరవకొండ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఉరవకొండ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్‌వో) రామ్మోహన్ తెలిపారు.

బుధవారం ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తగిన విచారణ జరపకుండా, నోటీసులు ఇవ్వకుండా ఏ ఓటరు పేరునూ జాబితా నుంచి తొలగించబోమని స్పష్టం చేశారు.

ఉరవకొండ నియోజకవర్గంలో మొత్తం 2,03,306 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వీరిలో పురుష ఓటర్లు 1,00,480 మంది (49.42 శాతం), మహిళా ఓటర్లు 1,02,801 మంది (50.56 శాతం), ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 25 మంది (0.01 శాతం) ఉన్నారని వెల్లడించారు. నియోజకవర్గంలో మొత్తం 286 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో మ్యాపింగ్ కాని ఓటర్లు, వివరాల్లో తేడాలు ఉన్నవారికి నోటీసులు అందజేస్తామని చెప్పారు. నోటీసులు అందుకున్న ఓటర్లు సంబంధిత ఆధార పత్రాలను సమర్పించాలని, వాటిని పరిశీలించి తగిన విచారణ చేపడతామని తెలిపారు. నియోజకవర్గంలో 46,206 మందికి నోటీసులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ సమావేశంలో ఉరవకొండ తహసీల్దార్ అరుణ, వజ్రకరూర్ తహసీల్దార్ జయశ్రీ, బెలుగుప్ప తహసీల్దార్ అనిల్‌కుమార్, విడపనకల్లు డిప్యూటీ తహసీల్దార్ చంద్రమోహన్‌రావు, ఉరవకొండ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ వరప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ అశ్వత్థనారాయణతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా సీనా, అబ్బాస్, టీడీపీ నాయకులు విజయభాస్కర్, సినిమా రామాంజనేయులు, బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈడిగ ప్రసాద్, జనసేన పార్టీ నాయకుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.