మోటార్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ఈఎస్‌ఐ, పీఎఫ్ అమలు చేయాలి: ఐఎఫ్‌టీయూ

పెద్దపల్లి రూరల్, ఆగస్టు 5 (ఆంధ్రప్రభ): ఆటో, మోటార్ రంగ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, ఈఎస్‌ఐ, పీఎఫ్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సౌకర్యం కల్పించాలని తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ (ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు ఐ. కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లా మోటార్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ పరిపాలనా అధికారి (ఏఓ) ద్వారా జిల్లా కలెక్టర్‌కు వివిధ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఐ. కృష్ణ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన మోటార్ రంగ కార్మికుల జీవితాల్లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆశించిన మార్పులు రాలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది మోటార్ రంగ కార్మికులు లారీలు, క్యాబ్‌లు, ఆటోలు, మినీ బస్సులు, వ్యాన్లు, అంబులెన్స్‌లు, డీసీఎంలు, మ్యాజిక్ వాహనాలు తదితరాలను నడుపుతూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు.

వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పీఎఫ్, ఈఎస్‌ఐ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రోడ్డు భద్రత చట్టంలోని హిట్ అండ్ రన్ నిబంధనలతో డ్రైవర్లపై తీవ్ర భారం పడుతోందని, ఆ నిబంధనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా మోటార్ రంగ కార్మికులను ఐక్యం చేసి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మోటార్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఈ. నరేష్, ఉపాధ్యక్షుడు బి. కొమరయ్య, ప్రధాన కార్యదర్శి ఎడ్ల రవికుమార్, జిల్లా నాయకులు ఐ. రాజేశం, తిర్రీ బాలకృష్ణ, పోగుల శేఖర్, ఎనగంటి సతీష్ తదితరులు పాల్గొన్నారు.