జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్‌ ప్రామాణిక పత్రం

  • నాణ్యమైన సమాచార సేకరణే లక్ష్యం
  • కలెక్టర్ సుమిత్ కుమార్

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్‌ అత్యంత ప్రామాణికమైన పత్రంగా రూపొందించాలని, గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి ప్రాంతం, ప్రతి రంగానికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారంతోనే భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలు రూపొందించబడతాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మండల స్థాయి అధికారులు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై క్షేత్రస్థాయిలో నాణ్యమైన సమాచార సేకరణకు కృషి చేయాలని ఆయన సూచించారు.

బుధవారం చిత్తూరులోని కలెక్టరేట్ నాగార్జున ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్ నమోదు ప్రక్రియపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనగణన ప్రక్రియలో ప్రతి వివరాన్ని క్షేత్రస్థాయిలో ధృవీకరించి నమోదు చేయాలని, జనగణన సిబ్బందికి సమగ్ర శిక్షణతో పాటు సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించారు.

జనగణన–2027 సన్నాహక కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని, మండల స్థాయి అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి విడతల వారీగా శిక్షణ ఇచ్చి అవసరమైన ఫారాలు, మార్గదర్శకాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. శిక్షణ అనంతరం క్షేత్రస్థాయి సిబ్బందితో నిరంతర ఫాలోఅప్ నిర్వహిస్తూ, వారు సేకరించిన సమాచారాన్ని సంబంధిత శాఖల ద్వారా తప్పనిసరిగా ధృవీకరించాలని చెప్పారు.

ఎస్‌ఈ ఆర్‌ అండ్‌బీ, ఎస్‌సీపీఆర్‌, హౌసింగ్‌, వైద్యారోగ్య శాఖ, డీసీహెచ్‌ఎస్‌, మున్సిపల్‌, విద్య, పరిశ్రమల శాఖలతో సమన్వయం చేసుకుని అవసరమైన సమాచారాన్ని సేకరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి శిక్షణ కార్యక్రమానికి ముందు మండల తహసీల్దార్లు, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవడం ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందిలో బాధ్యత పెరిగి నాణ్యమైన సమాచారం అందుతుందని తెలిపారు.

శిక్షణ ఇవ్వడమే కాకుండా క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ, ధృవీకరణ, ఫాలోఅప్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేసినప్పుడే ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. జనగణన ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్‌ను అత్యంత విశ్వసనీయమైన పత్రంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్, రాష్ట్ర సెన్సస్ విభాగ సహాయ సంచాలకులు సుప్రజ, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ లక్ష్మీకళతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.