గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించండి
ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతి
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలోని గ్రంథాలయాల అభివృద్ధి, నిధుల విడుదల, ఖాళీ పోస్టుల భర్తీ, డిజిటలైజేషన్ తదితర అంశాలపై ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, నెల్లూరు అర్బన్ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు డాక్టర్ రెడ్డివారి గురవారెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అమరావతిలోని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాలు సమర్పించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల గ్రంథాలయ సంస్థల చైర్మన్లతో కలిసి ముఖ్యమంత్రిని కలిసిన ఆయన, గ్రంథాలయాల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో గ్రంథాలయాలకు చెస్ (Library Cess) ద్వారా వచ్చే నిధులను సంబంధిత గ్రంథాలయాల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, వాటిని తక్షణమే అమలు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయాల్లో తీవ్ర ఉద్యోగుల కొరత నెలకొన్నందున, జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తున్న 100 పోస్టులతో పాటు మిగిలిన ఖాళీలను అవుట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేసి గ్రంథాలయాలను నిరంతరం పాఠకులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గ్రంథాలయ భవనాల నిర్మాణం, ఆధునికీకరణ, డిజిటలైజేషన్, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాల కల్పన వంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రితో సమగ్రంగా చర్చించినట్లు గురవారెడ్డి తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్ర గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి విద్యార్థులు, పాఠకులకు మరింత నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని కోరినట్లు వెల్లడించారు.
ఈ అంశాలన్నింటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి, వినతులను పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు గురవారెడ్డి తెలిపారు.
అనంతరం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులు, నెల్లూరు అర్బన్ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి నారాయణ ఆధ్వర్యంలో నాయకుల పర్యవేక్షణలో డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన విషయాలను నివేదిక రూపంలో ముఖ్యమంత్రికి అందజేసినట్లు డాక్టర్ రెడ్డివారి గురవారెడ్డి వెల్లడించారు.
