డీఎస్సీ-2025పై సీబీఐ విచారణ జరపాలి

  • దేవినేని అవినాష్, మల్లాది విష్ణు
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి
  • నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్
  • విజయవాడ సెంట్రల్‌లో ‘జెన్-జీ వార్’ టౌన్ హాల్ సమావేశం

పాయకాపురం, ఆంధ్రప్రభ: డీఎస్సీ-2025 నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు డిమాండ్ చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు మంగళవారం సింగ్‌నగర్‌లోని గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపంలో మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ‘జెన్-జీ వార్’ టౌన్ హాల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవినేని అవినాష్, మల్లాది విష్ణు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ చేపట్టిన ఉద్యమంలో భాగంగా డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా విద్యార్థులకు అందాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చిన నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సందర్భంగా టౌన్ హాల్‌లో మాట్లాడిన విద్యార్థి ప్రతినిధులు రాష్ట్రంలోని లక్షలాది మంది పేద, మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లల ఉన్నత విద్య కోసం ప్రభుత్వ సహాయంపై ఆధారపడుతున్నాయని తెలిపారు. చిన్నచిన్న పనులు చేసుకుంటూ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలనుకునే తల్లిదండ్రులు ఫీజు రీయింబర్స్‌మెంట్, అమ్మఒడి వంటి పథకాల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, అనంతరం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వాలు విద్యార్థులకు అండగా నిలిచాయని గుర్తు చేశారు.

ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీశైలజ రెడ్డి, విద్యార్థి సంఘం అధ్యక్షుడు రవిచంద్ర, మహిళా నాయకులు మేడేపల్లి ఘాన్సీ రాణి, పేరం త్రివేణి రెడ్డి, క్లస్టర్ ఇన్‌చార్జి పసుపులేటి ఏసు, వరలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు గౌస్ మొయిద్దీన్, అలంపూరు విజయ్ కుమార్, రాజారెడ్డి, ఆర్.ఎస్. నాయుడు తదితరులు పాల్గొన్నారు.