ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

డాక్టర్ దారా సుధీర్

నందికొట్కూరు, ఆంధ్రప్రభ: డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ చేపట్టాలని నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతిని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నందికొట్కూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బుధవారం టౌన్ హాల్ మీటింగ్ నిర్వహించనున్నట్లు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దారా సుధీర్ తెలిపారు.

ఈ మేరకు సోమవారం ఆయన వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దారా సుధీర్ మాట్లాడుతూ విద్యార్థులు నిరుద్యోగుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. డీఎస్సీ-2025 నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయి. వీటిపై సీబీఐ విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు.

అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలి. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలి అని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.ప్రజా సమస్యలపై పోరాడేందుకు వైసీపీ ఎప్పుడూ ముందుంటుందని విద్యార్థులు నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని డాక్టర్ దారా సుధీర్ స్పష్టం చేశారు.

ఈ నెల 5వ తేదీ బుధవారం ఉదయం 11:30 గంటలకు నందికొట్కూరు వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో జరిగే నియోజకవర్గ స్థాయి టౌన్ హాల్ సమావేశానికి విద్యార్థులు నిరుద్యోగులు ప్రజలు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.