పంటలపై తెగుళ్ల నివారణకు సమగ్ర సస్యరక్షణే మార్గం

జీవ నియంత్రణ పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలని శాస్త్రవేత్త డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి సూచన

చిట్యాల, ఆంధ్రప్రభ: ఖరీఫ్ సీజన్‌లో రైతులు సాగు చేసిన పంటల్లో వచ్చే తెగుళ్లు, పురుగుల నివారణపై మంగళవారం చిట్యాల రైతు వేదికలో సమగ్ర సస్యరక్షణ అవగాహన సదస్సు నిర్వహించారు.

పోతన ఎడ్యుకేషన్ సొసైటీ, ఓరుగల్లు ఎఫ్‌పీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో జయశంకర్ భూపాలపల్లి జిల్లా శాస్త్రవేత్త, టీఆర్‌వీకే కోఆర్డినేటర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి రైతులకు పంటల సంరక్షణపై అవగాహన కల్పించారు.

మిర్చి, పసుపు, పత్తి, వరి పంటల్లో వచ్చే తెగుళ్లు, పురుగులను సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ద్వారా నియంత్రించాలని సూచించారు. ముఖ్యంగా మిర్చి పంటలో గత నాలుగేళ్లుగా తీవ్ర నష్టం కలిగిస్తున్న నల్ల తామర పురుగును రసాయన మందుల వినియోగాన్ని తగ్గిస్తూ జీవ నియంత్రణ పద్ధతులతో అరికట్టాలని తెలిపారు.

వేప నూనె, బవేరియా బాసియానా వంటి జీవ నియంత్రణ ఉత్పత్తులను వినియోగించడంతో పాటు జిగురు అట్టలను అధిక సంఖ్యలో ఏర్పాటు చేసి పురుగుల ఉధృతిని తగ్గించవచ్చని రైతులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు సన్నీ, రమణ కుమార్, టీఆర్‌వీకే జిల్లా ప్రతినిధి మోహన్ రెడ్డి, రిటైర్డ్ డీడీఏ కె. ఉపేందర్ రెడ్డి, ఎన్జీవో కోఆర్డినేటర్ నాగరాజు, పోతన సొసైటీ కోఆర్డినేటర్, ఓరుగల్లు ఎఫ్‌పీసీఎల్ చైర్మన్ దువ్వాసి నరసయ్య, డైరెక్టర్ చాడ సమ్మిరెడ్డి, కార్యక్రమ నిర్వాహకులు కంచర్ల కిష్టయ్య, కానుగుల రాంరెడ్డి, కానుగుల కొమురయ్య, సూర కుమారస్వామి, పొన్నం అశోక్, నర్రా శివరామకృష్ణ, నీరటి భద్రయ్య, పడిదల హన్మంతురావు, ప్రజ్వల్ ఎఫ్‌పీసీఎల్ సిబ్బంది, నాబార్డ్ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.