రికార్డుల నుంచి సిబ్బంది పనితీరు వరకు క్షుణ్ణంగా పరిశీలన

బాధితుల ఫిర్యాదులపై తక్షణ స్పందనకు ఆదేశాలు

రౌడీషీటర్లు, పేకాట, వాహన తనిఖీలపై ప్రత్యేక దృష్టి
గంజాయి, రేషన్‌, ఇసుక మాఫియాలపై ఉక్కుపాదం

ఖమ్మం, ఆంధ్రప్రభ: ఖమ్మం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పోలీస్‌స్టేషన్ల పనితీరును గాడిలో పెట్టేందుకు పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌ ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం కారేపల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆయన అకస్మికంగా సందర్శించారు. ముందస్తు సమాచారం లేకుండా పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న సీపీ అక్కడి నిర్వహణ తీరును పరిశీలించారు. సిబ్బంది పనితీరు, కేసుల దర్యాప్తు, విచారణ నివేదికలు, జనరల్‌ డైరీ తదితర రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌లో సీజ్‌ చేసిన వాహనాలు, పరిసరాలను పరిశీలించి నిర్వహణపై ఆరా తీశారు. సెక్టర్‌ పోలీస్‌ అధికారులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న పరిస్థితులను తెలుసుకున్నారు. సీపీ ఆకస్మిక తనిఖీతో పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది అప్రమత్తమయ్యారు.

పెండింగ్‌ కేసులపై ఫోకస్‌ :

కారేపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైన కేసుల వివరాలను సీపీ సునీల్‌ దత్‌ పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసులపై ఆరా తీసి వాటి దర్యాప్తు ఏ దశలో ఉందో తెలుసుకున్నారు. కేసులను అనవసరంగా పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డయల్‌-100కు వచ్చే ఫోన్‌కాల్స్‌కు పోలీసులు స్పందిస్తున్న సమయాన్ని కూడా పరిశీలించారు. అత్యవసర సమయంలో బాధితులకు పోలీసులు వేగంగా చేరుకోవడం అత్యంత కీలకమని సీపీ సూచించారు. పోలీస్‌స్టేషన్‌ రికార్డులు క్రమబద్ధంగా నిర్వహించడంతో పాటు- దర్యాప్తు ప్రక్రియలో ప్రతి అంశాన్ని నమోదు చేయాలని తెలిపారు. కేసుల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

నిఘా పెంచాలి.. నేరాలపై ఉక్కుపాదం! :

నేరాల నియంత్రణలో భాగంగా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సీపీ సునీల్‌ దత్‌ సూచించారు. ప్రజలు తమ ఇళ్లు, వ్యాపార సంస్థలు, ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీటీ-వీ కెమెరాలను ఏర్పాటు- చేసుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. సీసీ కెమెరాల వినియోగంతో నేరాల నియంత్రణకు, నిందితుల గుర్తింపునకు మరింత అవకాశం ఉంటు-ందని పేర్కొన్నారు. రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని, ఎక్కడైనా నిర్వహిస్తున్నట్లు- గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వాహన తనిఖీలను ముమ్మరం చేసి అనుమానాస్పద కదలికలపై నిఘా పెంచాలని సూచించారు. ప్రత్యేక డ్రైవ్‌లను విధిగా నిర్వహిస్తూ నేరాలకు ముందస్తుగానే అడ్డుకట్ట వేసేలా చర్యలు చేపట్టాలని సీపీ ఆదేశించారు.

స్టేషన్లపై నిరంతర నజర్‌ :

కారేపల్లి పోలీస్‌స్టేషన్‌ తనిఖీతో ఆగకుండా కమిషనరేట్‌ పరిధిలోని ఇతర పోలీస్‌స్టేషన్ల పనితీరుపైనా సీపీ సునీల్‌ దత్‌ దృష్టి సారించినట్లు- స్పష్టమవుతోంది. పోలీస్‌స్టేషన్ల నిర్వహణ, సిబ్బంది పనితీరు, కేసుల దర్యాప్తు, పెండింగ్‌ కేసులు, ప్రజల ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలను ఆయన స్వయంగా పరిశీలిస్తున్నారు. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయాన్ని కూడా సీపీ సందర్శించి అధికారుల పనితీరుపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో పోలీసుల పనితీరు మెరుగుపడితేనే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలకు అవకాశం లేకుండా ప్రతి అధికారి, సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
నేర నియంత్రణతో పాటు- ప్రజల విశ్వాసాన్ని చూరగొనే పోలీసింగ్‌ ఉండాలని సీపీ దిశానిర్దేశం చేశారు. వరుస ఆకస్మిక తనిఖీలతో పోలీస్‌స్టేషన్లలో క్రమశిక్షణ, జవాబుదారీతనం పెంచే దిశగా సునీల్‌ దత్‌ చర్యలు చేపడుతున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి.

గంజాయి, రేషన్‌, ఇసుక మాఫియాలపై ఉక్కుపాదం

జిల్లాలో గంజాయి, రేషన్‌, ఇసుక మాఫియాలపై ఇప్పటికే అనేక కేసులు నమోదు చేసి పోలీస్‌శాఖ ఆ దందాలపై ఉక్కుపాదం మోపింది. జిల్లాలో పూర్తి స్థాయిలో గంజాయి, మత్తు మాఫియాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సీపీ సునీల్‌దత్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకుంటున్నారు. వీటి నిర్మూలణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని పోలీస్‌శాఖ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గంజాయి, రేషన్‌ బియ్యం అక్రమ రవాణదారులపై పీడీయాక్ట్‌ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకున్నారు.

భవిష్యత్తులో వీటిపై మరింత నిఘా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఈ అక్రమ రవాణాను నిర్మూలించటానికి చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు సీపీ సునీల్‌దత్‌ ఆదేశాలు సైతం జారీ చేశారు. ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి కేసులు నమోదు చేస్తున్నారు. పేద ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న రేషన్‌బియ్యాన్ని అక్రమరవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే వారిపై పీడీయాక్టులు సైతం నమోదు చేసి అక్రమరవాణాదారులపై ఉక్కుపాదం మోపింది. జిల్లాలో ఎటువంటి దందాలు లేకుండా పోలీస్‌శాఖ ఎప్పటికప్పుడు నిరంతర నిఘా ఏర్పాటు చేశారు.