నిధుల లెక్కలపై దండు మల్కాపురం గ్రామసభలో రచ్చ

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలో సర్పంచ్ గిర్కటి నిరంజన్ గౌడ్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన గ్రామసభ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఉప సర్పంచ్ మీసాల నరసింహ, పంచాయతీ కార్యదర్శి రమాదేవి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్న ఈ సమావేశంలో పంచాయతీ నిధుల వినియోగంపై ప్రశ్నలు తలెత్తడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రత్యేకాధికారి పాలనలో పంచాయతీకి చెందిన సుమారు రూ.1.20 కోట్ల నిధుల్లో అవకతవకలు జరిగాయని, అందులో రూ.54 లక్షల లెక్కలపై స్పష్టత ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కార్యదర్శి సమాధానంతో అసంతృప్తి చెందిన గ్రామస్తులు సభను బహిష్కరించి పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో గ్రామసభ వాయిదా పడింది.

ఈ సందర్భంగా సర్పంచ్ గిర్కటి నిరంజన్ గౌడ్ మాట్లాడుతూ తాను బీఆర్ఎస్‌కు చెందిన సర్పంచ్ కావడంతో గ్రామ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, అధికార పార్టీ అండతో పంచాయతీ కార్యదర్శి సహకరించడం లేదని ఆరోపించారు. సర్పంచ్‌గా రికార్డులు, రిజిస్టర్లు ఇవ్వాలని కోరితే సమాచార హక్కు చట్టం ద్వారా పొందాలని సూచించారని తెలిపారు. కార్యదర్శి తీరుపై జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని అన్నారు. రూ.54 లక్షల నిధుల వ్యవహారంపై పూర్తి స్పష్టత తీసుకువచ్చి గ్రామాభివృద్ధికి అధికారులు సహకరించాలని కోరారు.