ఏటీసీలతో యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు
రుద్రంగి, ఆంధ్రప్రభ: అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ) ఏర్పాటుతో యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో రూ.45 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఏటీసీ భవన నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి భూమిపూజ నిర్వహించారు. అనంతరం ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో రూ.40 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గితె, ఉపాధి కల్పన, శిక్షణ శాఖ డైరెక్టర్ నిర్మల క్రాంతి వెస్లీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.4,000 కోట్లతో 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ఐటీఐలను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించామని, ఏటీసీ విద్యార్థులకు నెలకు రూ.2 వేల స్టైపెండ్ అందిస్తున్నామని చెప్పారు. జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం విదేశీ భాషల శిక్షణ అందిస్తున్నామని, రుద్రంగికి జర్మన్ భాషా శిక్షకుడిని పంపించి 100 మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ వినియోగానికి అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెడతామని తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మూడపల్లిలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని, కలికోట సూరమ్మ ప్రాజెక్టు భూసేకరణ పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని తెలిపారు.
