ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్..

భవానిపురం, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు, పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎన్డీయే కార్యాలయంలో నిర్వహిస్తున్న ‘ప్రజా దర్బార్’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.

ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ ఉమ్మడి (చంటి), కూటమి నేతలు పీ.వి. చిన సుబ్బయ్య, నాగోతి రామారావు, బొమ్ము రాంబాబు, తారిక్ అజీజ్, దుర్గాప్రసాద్, బెన్నా భక్తుల సోమేశ్వరరావు, ఏలూరి సాయి శరత్ తదితరులు ప్రజల నుంచి వినతులను స్వీకరించి, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా ఇళ్ల స్థలాలు, పింఛన్లు, వైద్య సహాయం, రేషన్ కార్డులు తదితర సమస్యలకు సంబంధించిన వినతులను ప్రజలు అందజేశారు. వీటిలో చాలా వరకు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా, మిగిలిన వాటిని సంబంధిత శాఖల ద్వారా త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజా దర్బార్ ద్వారా ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని 54వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు తారిక్ అజీజ్, జనసేన పార్టీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ తెలిపారు.