Assam | ఇద్దరు జవాన్లను చంపి… ఆపై..
తోటి జవాన్లపై కాల్పులు.. ఆపై ఆత్మహత్య
Assam | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అసోంలోని నాగోన్ జిల్లాలోని సీఆర్పీఎఫ్ శిబిరంలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ జవాన్ తన సహచరులపై కాల్పులు జరిపి ఇద్దరిని హతమార్చిన అనంతరం తాను కూడా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు.
నాగోన్ జిల్లా కాటిమారిలో ఉన్న సీఆర్పీఎఫ్ 34వ బెటాలియన్ శిబిరంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ (జీడీ) ప్రేమాంబరం ఈ ఘటనకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. శిబిరం ప్రధాన ద్వారం వద్ద విధుల్లో ఉన్న సమయంలో అతడు ఒక్కసారిగా తోటి జవాన్లపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
ఈ కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ విష్ణు ప్రసాద్, సబ్ఇన్స్పెక్టర్ రమ్నావాల్ సింగ్ యాదవ్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ గోవింద్ శ్రీపుల్ తీవ్రంగా గాయపడగా, ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటనపై నాగోన్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ డీఎస్పీ పారమిత సర్కార్ మాట్లాడుతూ.. కాల్పుల అనంతరం నిందితుడు ప్రేమాంబరం కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. కాల్పుల శబ్దం విని అధికారులు అక్కడికి చేరుకునేలోపే ఈ ఘటన ముగిసిపోయిందన్నారు. ప్రేమాంబరం ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదని అధికారులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
